కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన శిక్షార్హమే..! | Andhra Pradesh High Court Sentences Software Employee to One Month in Jail | Sakshi
Sakshi News home page

కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన శిక్షార్హమే..!

Apr 14 2026 6:13 AM | Updated on Apr 14 2026 6:13 AM

Andhra Pradesh High Court Sentences Software Employee to One Month in Jail

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి హైకోర్టు నెలరోజుల జైలుశిక్ష, జరిమానా

సాక్షి, అమరావతి: కోర్టుకిచ్చిన హామీ ఉల్లంఘన ఎంతమాత్రం క్షమార్హం కాదని హైకో­ర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. దీంతోపాటు రూ.10వేలు ఖర్చు­­లు విధించింది. ఈ మొత్తాన్ని ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీకి జమ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆస్తి వివాదానికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నగతం ముకుందరెడ్డి, మరికొందరిపై నగతం సునీత, మరో ముగ్గురు 2009లో తిరుపతి ఐదో అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.

విచారణ జరిపిన తిరుపతి కోర్టు, ఆస్తిలో 1/4 వాటా సునీత తదితరులకు చెందుతుందని 2017లో డిక్రీ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ముకుందరెడ్డి తదితరులు హైకోర్టులో అప్పీల్‌ చేయడంతో తీర్పు అమలు ఆగిపోయింది. కాగా తిరుపతి కోర్టులో తాము దాఖలు చేసిన తమ ఆస్తి  ఒరిజినల్‌ డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముకుందరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తాకట్టు పెట్టడం గానీ, ఆస్తిపై మూడో పక్షానికి హక్కులు సృష్టించడం గానీ చేయబోమని హైకోర్టుకు హామీ ఇచ్చారు.

దీంతో ఈ మేరకు 2021లో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. అయితే ముకుందరెడ్డి కోర్టు నుంచి తీసుకున్న ఆస్తి ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టారని, ఆ ఆస్తిని థర్డ్‌ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేంటూ సునీత మరికొందరు 2025లో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ తిల్హరీ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. ముకుందరెడ్డి ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కారమేనని తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement