ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే | Sakshi
Sakshi News home page

ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే

Published Thu, May 5 2022 4:06 AM

Andhra Pradesh Govt New Facility Ration Card Newly Married - Sakshi

సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్‌ కమిషనర్‌ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్‌కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు.

2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. 

Advertisement
Advertisement