
‘సెకీ’ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ తీసుకున్నా సరిపోదని, యాక్సిస్ వంటి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఏపీఈఆర్‌సీ పేర్కొన్న భాగం
పీక్ అవర్స్‌లో విద్యుత్ డిమాండ్ పెరగడం సాధారణం
ఆ సమయంలో బహిరంగ మార్కెట్‌లో కొనడం సహజం
అది కూడా రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేకుంటేనే..
ఈ డిమాండ్‌ను సమతూకం చేయడానికే గత ప్రభుత్వం ‘సెకీ’తో ఒప్పందం
ఇన్నాళ్లూ సెకీ నుంచి విద్యుత్ తీసుకుంటే వృథా అన్న చంద్రబాబు, కూటమి నేతలు
ఇప్పుడు ఆ 7 వేల మెగావాట్లు కూడా సరిపోవని కొత్త పాట
‘యాక్సిస్’తో ఒప్పందంపై నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: సాయంత్రం అవసరమవుతుందని.. ఉదయం నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తామా? వేసవిలో డిమాండ్ ఉంటుందని వానాకాలంలోను, శీతాకాలంలోను తక్కువ రేటుకు విద్యుత్ దొరికే అవకాశం ఉన్నా, దాన్ని కాదని ఎక్కువ రేటు చెల్లిస్తామా..? ఎప్పుడు అవసరమైతే అప్పుడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ దొరుకుతుంటే.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోపాటు రిలయన్స్ వంటి బడా కంపెనీలు తక్కువ రేటుకే విద్యుత్ సరఫరా చేసేందుకు ముందుకొస్తుంటే విజ్ఞత ఉన్నవారెవరైనా వద్దంటారా..? యాక్సిస్ ఎనర్జీతో కూటమి ప్రభుత్వం ఒప్పందం గురించి తెలిసిన తర్వాత ఎవరికైనా వచ్చే సాధారణ సందేహాలివి.
కానీ, దోచుకోవడమే పరమావధిగా భావించే సీఎం చంద్రబాబుకు మాత్రం ఇవేవీ పట్టవు. అందుకే దాదాపు రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి నిస్సిగ్గుగా తెరతీశారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పీపీఏ కుదుర్చుకున్నారు. 400 మెగావాట్ల పవన–సౌర హైబ్రీడ్ పైలట్ ప్రాజెక్టు నుంచి పునరుత్పాదక విద్యుత్‌ను 25 ఏళ్లపాటు యూనిట్‌కు ఏకంగా రూ.4.60 చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు.
ఇదేం విడ్డూరం బాబూ
వ్యవసాయానికి 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ అందించడానికి, రాష్ట్రంలో భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు, పవర్ గ్రిడ్ డిమాండ్‌ను సమతూకం చేసేందుకు ‘సెకీ’ నుంచి సౌర విద్యుత్‌ను తీసుకోవాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అది కూడా సెకీ తనకు తానుగా ముందుకొచ్చి విద్యుత్ సరఫరా చేస్తామని ప్రతిపాదిస్తూ లేఖ రాయడం వల్ల జరిగింది. అందులోనూ 7వేల మెగావాట్లను కేవలం యూనిట్ రూ.2.49కే పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపుతో అందిస్తామని సెకీ చెప్పడంతో ఒప్పందం కుదుర్చుకుంది.
గతేడాది నుంచే ఈ విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు తీసుకోవాల్సి ఉన్నా, కూటమి అధికారంలోకి రావడంతో ఆగిపోయింది. ఇంతవరకూ తక్కువ ధరకు వచ్చే సెకీ విద్యుత్‌ను ఏపీ వినియోగించుకోలేకపోతోంది. కానీ, ఇప్పటివరకు ప్లాంటు కూడా పెట్టని యాక్సిస్‌తో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రెండేళ్లలో నిరి్మంచి, ఆ తర్వాత యూనిట్ రూ.4.60కి కొనేందుకు కూటమి ఒప్పందం కుదుర్చుకుంది. పైగా ఇన్నాళ్లూ సెకీ నుంచి విద్యుత్ తీసుకుంటే విద్యుత్ వృథా అవుతుందని, ప్రజలపై భారం పడుతుందని టీడీపీ, ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి.
కానీ, ఇప్పుడు సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకున్నా కూడా రాష్ట్ర అవసరాలకు సరిపోదని ఏపీఈఆర్‌సీ చేత సీఎం చంద్రబాబు చెప్పించారు. పాతికేళ్లపాటు తక్కువ ధరకు సెకీ విద్యుత్ వస్తుంటే తీసుకోలేనివారు, రెండేళ్ల తర్వాత వస్తుందనుకుంటున్న యాక్సిస్ పవర్‌ను అధిక ధరకు కొంటామనడం విడ్డూరంగా ఉందని ఇంధన రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
పక్కా దోపిడీ!
సహజంగా సౌర విద్యుత్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పవన విద్యుత్ వస్తుంది. ఏడాదిలో కొన్ని రోజులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, డిమాండ్ వల్ల గ్రిడ్ ప్రభావితమైనప్పుడు ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు రావడం పునరుత్పాదక విద్యుత్‌లో సహజం. ఇలాంటి సమయాల్లో గ్రిడ్ ఫ్రీక్వెన్సీని బాలెన్స్ చేయడానికి బేస్ పవర్‌ను ఫీడ్ చేస్తారు. అంటే థర్మల్, హైడల్, గ్యాస్ వంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ను తీసుకుంటారు. అలా కూడా విద్యుత్ సరిపోలేదంటే, బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సే్చంజీ)లో కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి, కొనుగోలు చేసే సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో ఉంది.
కానీ, సౌర విద్యుత్ రాత్రి వేళ అందుబాటులో ఉండదనే విషయాన్ని బూచిగా చూపించి ప్రజల ఖజానాను దోచేసే పయత్నం చంద్రబాబు చేస్తున్నారు. బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ వల్ల నాలుగు గంటలపాటు యాక్సిస్ విద్యుత్ బ్యాక్ అప్ వస్తుందని, అందుకే అంత రేటు పెట్టామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌కు రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావడమంటే.. ఇంతకంటే పచ్చి దోపిడీ ఉండదు. పీక్ అవర్స్ డిమాండ్ 3 నుంచి 4 గంటలు మాత్రమే ఉంటుంది. దాని కోసం మిగిలిన 20 గంటలకు ఒకే ధర చెల్లించడం, పక్కా అవినీతికి నిదర్శనమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.