నిబంధనలమేరకే ‘రుషికొండ’ నిర్మాణాలు | Allegations are untrue with Eenadu News Article on Rushikonda | Sakshi
Sakshi News home page

నిబంధనలమేరకే ‘రుషికొండ’ నిర్మాణాలు

Apr 26 2022 4:16 AM | Updated on Apr 26 2022 7:50 AM

Allegations are untrue with Eenadu News Article on Rushikonda - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ పర్యాటక ప్రాజెక్టును ‘కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు అనుగుణంగానే నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ స్పష్టం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి పూర్తి అనుమతులు పొంది ఆమేరకే నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొంది. సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని పర్యాటకశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.240 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి  సంస్థ (ఏపీటీడీసీ) ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిందని పేర్కొంది. 9.88 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 5.18 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతుండగా 4.70 ఎకరాలు సుందరీకరణకు కేటాయించినట్టు తెలిపింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అనుమతించిన 139 చెట్లనే తొలగించామని, మిగిలినవి పొదలేనని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లను తొలగించినట్టు ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో పేర్కొనడం అవాస్తవమని తెలిపింది. తొలగించిన చెట్లకు బదులుగా అంతకు రెండింతలకుపైగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే నిర్ణయించామని, భవన నిర్మాణాలు పూర్తికాగానే మొక్కలు నాటతామని తెలిపింది. నిర్మాణ వ్యర్థాలు, కంకరను తీరప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర పారబోస్తున్నట్టు చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేసింది.

విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అనుమతించిన 287, 288 సర్వే నంబర్లతో ఉన్న ప్రభుత్వ భూమిలోనే డంప్‌ చేస్తున్నామని, ఆ మట్టిని భవిష్యత్‌లో లోతట్టు ప్రాంతాలను ఎత్తుచేసేందుకు జిల్లా యంత్రాంగం వినియోగిస్తుందని తెలిపింది. తీరప్రాంతంలో తాబేళ్లు, ఇతర సముద్ర జీవుల ఉనికికి ఎలాంటి ముప్పువాటిల్లడం లేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ  మాస్టర్‌ ప్లాన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ‘ఈనాడు’ తన కథనంలో చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ మిక్స్‌డ్‌ యూజ్‌ జోన్‌–3 పరిధిలోకి వస్తుందంది.  

అంటే ఈ ప్రాంతంలో ఆతిథ్య రంగంలో ప్రాజెక్టులు నిర్మించేందుకు వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ అనుమతిస్తోందని వెల్లడించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌  నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ఈ ప్రాజెక్టును పరిశీలించి నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్టుగా నివేదిక ఇచ్చిందని గుర్తుచేసింది.  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రుషికొండ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.  సీఆర్‌జెడ్, వీఎంఆర్‌డీఏ నిబంధనలను అనుసరిస్తూ ఎన్‌జీటీ అనుమతుల మేరకు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement