ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె తాత్కాలిక విరమణ | Aarogyasri Network Hospitals strike temporarily suspended | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె తాత్కాలిక విరమణ

Apr 8 2026 4:21 AM | Updated on Apr 8 2026 4:21 AM

Aarogyasri Network Hospitals strike temporarily suspended

పది రోజుల్లో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ 

అప్పటి వరకు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నామని ‘ఆశా’ ప్రకటన

పది రోజుల్లోగా  నిధులు విడుదల చేయకపోతే యథావిధిగా సమ్మె

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ప్రైవే­ట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు బకాయిలు చెల్లించాల­ని ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళ­వారం తాత్కాలికంగా విరమించాయి. ప్రభు­త్వం పది రోజుల్లో రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మెను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్‌ హాస్పి­టల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,000 కోట్ల బకాయి­లు పెట్టడంతో ఈ నెల 1 నుంచి ప్రైవేట్‌ నెట్‌­వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేసి సమ్మె చేస్తున్నాయి. సోమవారం రెండో దఫా ప్రభుత్వం ఆశా ప్రతి­నిధులతో చర్చ­లు జరిపింది. 

మొత్తం బకా­యిల్లో రూ.1,000 కోట్లను పది రోజుల్లో, జూలై అనంతరం మరో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభు­త్వం హామీ ఇచ్చిందని ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ చెప్పా­రు. ప్రతి నెలా రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల మేర బి­ల్లులు చెల్లించడంతోపాటు నూతన బీమా విధా­నం రూపకల్ప­నలో నెట్‌వర్క్‌ ఆస్ప­త్రుల­ను భాగ­స్వా­మ్యం చేస్తామని ప్రభుత్వం తెలి­పిందని చెప్పారు. అందువల్ల 10 రోజులు తాత్కా­లి­కంగా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. 

నమ్మకం లేక...
ప్రభుత్వం పది రోజుల్లో నిధులు విడుదల చే­స్తామని హామీ ఇచ్చినప్పటికీ నెట్‌వర్క్‌ ఆస్ప­త్రుల యజమానులు మాత్రం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు గద్దెనె­క్కా­క గతంలో రెండుసార్లు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బ­కాయిల కోసం సమ్మె చేశాయి. గతేడాది సె­ప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో సమ్మె చేసిన సమ­యంలో డిసెంబర్‌కి బకాయిలన్నీ చెల్లించేస్తామ­ని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వా­త పట్టించుకోలేదు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ సమ్మెను తాత్కాలికంగానే నిలుపుదల చేస్తున్నామని ఆశా స్పష్టం చే­సింది. పది రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement