పల్లెల్లో మొదలైన ఎన్నికల వేడి | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో మొదలైన ఎన్నికల వేడి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుందా.. తమకు పోటీ చేసే అవకాశం దక్కుతుందా.. తమ గ్రామంలో సర్పంచ్‌ స్థానం ఏ వర్గానికి రిజర్వ్‌ అవుతుంది.. వార్డు సభ్యుల స్థానాల కేటాయింపు ఎలా ఉంటుంది.. అనే అంశాలపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 576 గ్రామ పంచాయతీలు, 5,840 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం 6,025 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ఆర్డీఓ కార్యాలయాల్లో, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను ఎంపీడీఓ కార్యాలయాల్లో చేపట్టారు. ఏ పంచాయతీలో ఎన్ని వార్డులు ఏ కేటగిరీకి కేటాయించాలనే వివరాలు ఇప్పటికే ఆర్డీఓల నుంచి ఎంపీడీఓలకు చేరాయి. దీంతో ఆయా వార్డులకు రిజర్వేషన్లు కేటాయించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

పంచాయతీ ఎన్నికలు గ్రామస్థాయిలో రాజకీయ పార్టీల బలాబలాలకు పరీక్షగా నిలవనున్నాయి. అధికార పార్టీకి చెందిన ఆశావహులు తమ రాజకీయ పలుకుబడి, పోలీసు వ్యవస్థ అండతో గట్టెక్కాలని చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆందోళన వారిని కలవరపెడుతోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లడంతోపాటు స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ గ్రామస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, గ్రామంలో ఉన్న పలుకుబడి, సామాజిక సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశముంది. అధికారులు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత గ్రామాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశముంది.

జెడ్పీలో అధికారుల కసరత్తు

అనంతపురం న్యూ టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియ జెడ్పీలో కొనసా..గుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన నిర్ణయం కోసం అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది. బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న 34 శాతం నిర్ణయం న్యాయస్థానంలో బెడిసికొట్టింది. ఎన్నికల్లో అన్ని వర్గాలకూ కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్నది కోర్టు తీర్పు సారాంశం. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ త్వరలో జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వారీగా రిజర్వేషన్ల జాబితాను విడుదల చేస్తారు. ఆ జాబితా వచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగిస్తుంది. కోర్టు చెప్పిన 50 శాతం పరిమితిని పాటిస్తూ, కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా కొత్త రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌లో మూడు రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయోనన్న ఉత్కంఠ ఆశావహుల్లో పెరిగిపోతోంది. మరో రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావచ్చని అధికారులు చెప్తున్నారు.

బరిలో నిలవాలంటే రిజర్వేషన్‌ తేలాల్సిందే..!

గ్రామాల్లో సర్పంచ్‌ పీఠాలపై కన్నేసిన ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలమైన కేటగిరీలో స్థానం రిజర్వ్‌ అయితే పోటీకి దిగాలని కొందరు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యం ఉన్న మేజర్‌ పంచాయతీల్లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకులతో చర్చలు, గ్రామస్థాయి సమీకరణాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నాయి.

సర్పంచ్‌– వార్డు రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ

జిల్లాలో 576 పంచాయతీలు.. 5,840 వార్డు స్థానాలు

రిజర్వేషన్ల ప్రకటనతో మారనున్న రాజకీయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement