● మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్
అనంతపురం : ‘ప్రభుత్వ నిర్ణయాలను ఉన్నత న్యాయస్థానాలు తప్పుపట్టినప్పుడు నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబుకి ‘రాయలసీమ పౌరుషం’ ఉంటే వారి బాటలోనే నడిచి రాజీనామా చేయాలి’ అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 25.18 శాతానికే పరిమితం చేస్తూ వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు తరహాలో పోరాడాలి
బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఉంటే.. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాదిరిగా పోరాడాలని రంగయ్య సూచించారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద తన పలుకుబడిని ఉపయోగించి 34 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించి చట్టబద్ధత కల్పించాలన్నారు.
శాసీ్త్రయ డేటా సేకరించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వెనుకబాటుతనాన్ని నిరూపించేందుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’ ద్వారా శాస్త్రీయ డేటా సేకరించాలని రంగయ్య డిమాండ్ చేశారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, రాజకీయ ప్రాతినిధ్య లోటును అది ప్రతిబింబించదని స్పష్టం చేశారు.
మభ్యపెట్టే రాజకీయాలకు స్వస్తి పలకాలి
బీసీల పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేస్తూ మభ్యపెట్టే రాజకీయాలకు అధికార పార్టీ నేతలు స్వస్తి పలకాలని తలారి రంగయ్య హితవు పలికారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ అవకాశాలు, పదవుల ప్రాతినిధ్యంపై చర్చకు రావాలని సవాల్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 50 ఏళ్లు దాటిన బీసీలకు నెలకు రూ.4వేల పింఛన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు హక్కులు, న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు.


