అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఏపీ స్పెషల్ టెట్–2026 జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,089 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 1,075 మంది హాజరయ్యారు. 14 మంది గైర్హాజరయ్యారని డీఈఓ అయ్యూబ్ హుస్సేన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. కాగా ఎస్వీఐటీ పరీక్ష కేంద్రాన్ని డీఈఓ పరిశీలించారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అయ్యూబ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు, ఇతర కారణాలతో విద్యను కొనసాగించలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతి కోర్సులో, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, ఒరియా మాధ్యమాల్లో చదువుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ విధానంలో విద్యను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని, అర్హులైన అభ్యర్థులు గడువులోగా ప్రవేశాలు పొందాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ద్వారా పొందిన ధ్రువపత్రాలతో నిబంధనల ప్రకారం తదుపరి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని స్పష్టం చేశారు.
ఆర్పీఎఫ్ ఏఎస్పీకి రాష్ట్రపతి పోలీస్ పతకం
గుంతకల్లు: రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్)లో విశిష్ట సేవలందించిన గుంతకల్లు డివిజన్ రేణిగుంట ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కె.రాజగోపాల్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ పతకం అందుకున్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఆర్పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో భాగంగా ఆయనకు మెడల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గుంతకల్లు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్ కుమార్ జైస్వాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, కర్తవ్య నిర్వహణతోపాటు సేవాతత్పరతకు గాను రాజగోపాల్ రెడ్డికి దక్కిన గౌరవమని కొనియాడారు. ఆయన సాధించిన ఈ ఘనత ఆర్పీఎఫ్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తుకు
27 వరకు గడువు
అనంతపురం ఎడ్యుకేషన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష (2026–27)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ అయ్యూబ్ హుస్సేన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు. దరఖాస్తు గడువును ఇకపై పొడిగించబోరని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. నవంబర్ 15న జరగాల్సిన పరీక్షను నవంబర్ 29వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు, పరీక్ష రుసుం చెల్లించేందుకు ఈ నెల 27వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజినల్ ఎస్‌బీఐ కలెక్ట్ రసీదును సంబంధిత డీఈఓ కార్యాలయంలో ఈ నెల 28 లోపు సమర్పించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి లాగిన్‌లో దరఖాస్తుల ధ్రువీకరణకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉంది.


