ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

● డాక్టర్‌ సాకే శైలజనాథ్‌

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కు అత్యంత కీలకమైనదన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాస్వామ్య పాలనకు స్థానిక సంస్థల ఎన్నికలే పునాదని అన్నారు. ఇవి అధికారంలో ఉన్నవారి రాజకీయ ప్రయోజనాలకు కాకుండా, ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయానికి అనుగుణంగా జరగాలని కోరారు. అధికార బలం, ధనబలం, రాజకీయ ఒత్తిళ్లు, అధికార యంత్రాంగ ప్రభావం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకుండా చూడటం ప్రతి అధికారి బాధ్యత అని గుర్తు చేశారు.

బెదిరింపులపై చర్యలు తీసుకోవాలి

నామినేషన్లు ఎలా వేస్తారో చూస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్న కొంతమంది అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని, అన్ని చోట్లా తగిన భద్రత కల్పించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల స్వేచ్ఛకు భంగం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ బందోబస్తు చూడాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగంపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. చట్టపరమైన రిజర్వేషన్లను సరిగ్గా అమలుపరిచి ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి (సరిబాల) ప్రతాప్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ గోకులరెడ్డి, యువ నాయకులు డాక్టర్‌ సాకే రుత్విక్‌ హృదయ్‌, మధుసూదన్‌రెడ్డి, బోనాల హరికృష్ణ, అంకే నరేష్‌, ప్రదీప్‌, సాకే రామాంజనేయులు, సాకే శివశంకర్‌, సత్యాలు, రేవంత్‌రెడ్డి, పరంధామరెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement