సమస్యలు పరిష్కరించండి
● ‘పరిష్కార వేదిక’లో అర్జీదారుల వినతి
అనంతపురం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించండంటూ అర్జీదారులు కోరుతున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్‌రెడ్డి, వెంకటనారాయణ, కిరణ్మయి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 441 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 232 అర్జీలు, ఇతర సమస్యలకు సంబంధించి 209 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
అర్జీల్లో మచ్చుకు కొన్ని..
● తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని రాయదుర్గానికి చెందిన వి.లీలావతి అర్జీ సమర్పించింది. తన భర్త 1998 అక్టోబరు 15న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించాడని చెప్పింది. మరణ ధ్రువపత్రం కావాలని ఆస్పత్రిలో అడిగితే పేరు నమోదు కాలేదని చెబుతున్నారని, మునిసిపాలిటీలో అడిగితే సమాచారమే లేదంటున్నారని వాపోయింది.
ఈ దివ్యాంగుని పేరు పాండురంగయ్య. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లి గ్రామం. రెండున్నర ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో ఎడమ చేయి, ఎడమ కాలు పనిచేయడం లేదు. 50 శాతం వైకల్యం ఉన్నట్లు ఈ ఏడాది జూన్ 21న తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛనుకు దరఖాస్తు చేసుకుంటే శాశ్వత సర్టిఫికెట్ లేదు కాబట్టి పింఛను అర్హత లేదని చెప్పారని తెలిపాడు.


