అధికార అండ.. దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

అధికార అండ.. దౌర్జన్యకాండ

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక ఉరవకొండ నియోజకవర్గంలో అధికార ‘పచ్చ’ నేతలు రెడ్‌బుక్‌ రాజ్యాంగం మాటున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడటమే కాక ఇళ్లపైనా దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. భూములు తదితర ఆస్తులు కబ్జా చేసి.. ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే మంత్రి కేశవ్‌తో పాటు సోదరుడు శీనప్పను కలిసి టీడీపీ కండువా వేసుకుంటే అన్నీ ఆపేస్తామంటున్నారు. గ్రామాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని మంత్రి అనుచరులు బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు.

● ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన కౌడిగి గోవిందు వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈయన్ను టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. గోవిందు అల్లుడు జయకుమార్‌ విడపనకల్లు మండలం వేల్పుమడుగులో కొనుగోలు చేసిన 21.05 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్‌ వేశారు. కొనుగోలు చేసిన భూమి దేవదాయ శాఖకు చెందినదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి, పోలీసులతో భయబ్రాంతులకు గురిచేశారు. దీనిపై బాధితుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదరు భూమి జయకుమార్‌దేనని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు కూడా ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు రైతు జయకుమార్‌ను సదరు పొలంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు.

● ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో గొర్రెల కాపర్ల మధ్య జరిగిన గొడవల్లో ఎటువంటి సంబంధమూ లేని 12 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించారు.

● జల్లిపల్లి సర్వేనంబర్‌ 486లో 24.45 ఎకరాల భూమి వైఎస్సార్‌సీపీ కూడేరు మండల కన్వీనర్‌ బైరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై ఉంది. అయితే ఆ భూమికి టీడీపీ నేతలు ఫేక్‌ రికార్డులు సృష్టించి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి భూ వివాదానికి కారకులయ్యారు.

● ఉదిరిపికొండలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి రాస్తారోకోలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులను గుర్తించి.. 108 అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదంటూ కేసులు పెట్టించారు.

● బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ సంజీవరెడ్డి ముఖ్యమంత్రిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు వేసి.. విచారణ పేరిట 20 పోలీసు స్టేషన్లు తిప్పారు.

● ఉరవకొండ మండలం లత్తవరం తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ గిరిజన నాయకుడు ప్రసాద్‌ నాయక్‌పై దాడి చేసి.. ఆయనే దాడి చేసినట్లు టీడీపీ వారు తప్పుడు కేసు పెట్టారు.

● ఉరవకొండ మండలం బూదగవి వైఎస్సార్‌సీపీ నాయకుడు ధనంజయకు సర్వే నంబర్‌ 333–ఏలోని 6.20 ఎకరాలు, సర్వే నంబర్‌– 313లోని 2.43 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొన్నేళ్లుగా పంటలు సాగుచేస్తున్నాడు. అయితే ఈ భూమిని ఇతరులు కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు ఫేక్‌ రికార్డులు సృష్టించి, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. దీనిపై బాధితుడు ధనంజయ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకంగా పొలంలోకి వెళ్లి సర్వే చేయించే ప్రయత్నం చేశారు. ఇదేమిటని అడ్డుకోబోయిన ధనంజయ సోదరుడిని పోలీసులు దూషించారు. దీంతో మనస్తాపం చెందిన ధనంజయ సోదరుడు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌

పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు

బాధితుల పక్షాన నిలవని

అధికార యంత్రాంగం

దౌర్జన్యాలకు నిరసనగా

నేడు వైఎస్సార్‌సీపీ మహా ధర్నా

నేడు మహా ధర్నా..

టీడీపీ నేతల దౌర్జన్యకాండకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు రమేష్‌గౌడ్‌ తదితరులు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని నినదించనున్నారు.

కక్ష కట్టి.. కేసులు పెట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement