అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో పరిస్థితుల నడుమ పంటల బీమా పథకాలు ఆదుకుంటాయనే ఆశతో రైతులు ప్రీమియం చెల్లింపునకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణబీమా, ఫసల్‌బీమా పథకాల నోటిఫికేషన్ ఖరీఫ్ ఆరంభమైన 40 రోజులకు ప్రకటించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య గత 10 రోజులుగా రైతులు పడిన బాధలు వర్ణనాతీతం. ఈ క్రమంలో వాతావరణ బీమా కింద నోటిఫై చేసిన వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, అరటి, టమాట పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల ఒకటో తేదీ (శనివారం) అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. మొత్తంగా 80,097 మంది రైతులు 1,15,354 హెక్టార్ల పంటలకు ప్రీమియం కట్టినట్లు అధికారులు తెలిపారు.
1.47 లక్షల హెక్టార్లకు ఫసల్‌బీమా..
ఫసల్‌బీమా కింద నోటిఫై అయిన వరి, జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం, ఎండుమిరప పంటలకు ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రస్తుతానికి 90,500 మంది రైతులు 1.47 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. గడువు నాటికి 1.75 లక్షల హెక్టార్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో కంది పంటకే వేలాదిమంది రైతులు ప్రీమియం చెల్లించగా.. ఆ తర్వాత ఆముదం, ఎండుమిరప, అలాగే వరికి ప్రీమియం కడుతున్నట్లు చెబుతున్నారు. ప్రీమియం చెల్లింపులో ప్రస్తుతానికి వజ్రకరూరు మండల రైతులు మొదటి స్థానంలో నిలిచారు. అటు వాతావరణ, ఇటు ఫసల్‌బీమా కింద వజ్రకరూరులో 12 వేల మంది రైతులు 20 వేల హెక్టార్లకు బీమా చేయించుకుని టాప్‌లో నిలిచారు. ప్రీమియం గడువు ముగిసిన 15 రోజులకు పంటల వారీగా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయని బీమా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
పంటల బీమా విలువ రూ.2,289 కోట్లు
జిల్లా రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించి రూ.2,289 కోట్లు విలువ చేసే పంటలకు బీమా చేయించుకున్నారు. అందులో వాతావరణ బీమా కింద రైతులు తమ వాటా కింద రూ.33.32 కోట్ల మేర ప్రీమియం చెల్లించడంతో దాని విలువ రూ.1,083.06 కోట్లుగా గుర్తించారు. అలాగే ఫసల్‌బీమా ప్రీమియం ఇంకా కొనసాగుతుండగా ప్రస్తుతానికి రైతులు తమ వాటా కింద చెల్లించిన రూ.6.17 కోట్ల ప్రీమియం ఆధారంగా పంట విలువ రూ.1,206.30 కోట్లుగా లెక్క తేల్చారు.
1.15 లక్షల హెక్టార్ల పంటలకు
వాతావరణ బీమా


