నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

అనంతపురం అర్బన్‌ కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కార వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ సమర్పించవచ్చని తెలిపారు.

ఉరవకొండ డిగ్రీ కళాశాలకు అరుదైన అవకాశం

ఉరవకొండ: నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ అధ్వర్యంలో ఆదివారం నషా ముక్త్‌ యువ వికసిత్‌ భారత్‌ వర్చువల్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. కాన్ఫరెన్స్‌కు 125 కళాశాలలు ఎంపిక కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 కళాశాలలు ఎంపికయ్యాయి. ఇందులో ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కుడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌ సమావేశం ద్వారా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం వంద వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శైలజారాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ మస్తానప్ప, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్లు ఎం.విష్ణుప్రియ, సుధాకర్‌, ఎన్‌సీసీ అధికారి ప్రశాంత్‌, అద్యాపకులు అయ్యన్న, సిరాజ్‌ అలీ, వెంకటరాముడు, నారాయణస్వామి, జమీల, సుజాత, వెంకటేష్‌, ఆంజినేయులు, రమేష్‌, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

రెండు స్కూల్‌ బస్సులకు నిప్పు

తాడిపత్రి రూరల్‌ : ప్రమాదవశాత్తూ రెండు స్కూల్‌ బస్సులకు నిప్పంటుకుంది. పట్టణ సమీపాన పుట్లూరు రోడ్డులోని గురుకుల్‌ స్కూల్‌కు చెందిన రెండు బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో స్క్రాప్‌ కింద పరిగణించి ఆవరణలో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ రెండు బస్సులకూ నిప్పంటుకున్నాయి. ఇందులో ఒక బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. మరొకటి పాక్షికంగా దెబ్బతినింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా వ్యాపించాయో తెలియడం లేదని పాఠశాల కరస్పాండెంట్‌ సతీష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement