టీచర్లకు టెట్‌ టెన్షన్‌ ! | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు టెట్‌ టెన్షన్‌ !

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) అంటే ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల పరీక్షగానే భావించేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో టెట్‌ రాయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోధన చేసే టీచర్లందరికీ టెట్‌ అర్హత తప్పనిసరి. దీంతో టెట్‌ అర్హత లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు టెట్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 18,191 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ది చర్చ్‌ సోషల్‌ యాక్షన్‌ ఇండియా, శ్రీనివాస రామానుజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల, గేట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సీవీ రామన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. రోజూ రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. తొలివిడత ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5 గంటల వరకు ఉంటుంది.

టీచర్లకు సవాల్‌గా టెట్‌..

పది, పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న కొందరు ఉపాధ్యాయులు మళ్లీ టెట్‌ రూపంలో పోటీ పరీక్ష రాయాల్సి రావడం వారికి మానసికంగా సవాల్‌గా మారింది. కొత్త సిలబస్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), సమయ నిర్వహణ వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పడం, పాఠశాలల పరిపాలనా పనులు, రికార్డుల నిర్వహణ, ఎఫ్‌ఏ–1 పరీక్షల ఏర్పాట్లు, సమావేశాలు, సమీక్షలు... ఇలా రోజంతా విధుల్లోనే గడుస్తోంది. ఇంటికి చేరుకున్న తర్వాతే టెట్‌ పుస్తకాలు చేతిలోకి తీసుకుంటున్నారు. కొందరు తెల్లవారుజామునే లేచి చదువుతుంటే, మరికొందరు అర్ధరాత్రి వరకు మాక్‌ టెస్టులు రాస్తూ సన్నద్ధమవుతున్నారు.

అభ్యర్థులకు సూచనలు..

ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒకటి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తారు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా గుర్తింపు కార్డును పరిశీలించి రెండు ఫొటోలు, డిక్లరేషన్‌ తీసుకుని పరీక్షకు అనుమతిస్తారు. స్క్రైబ్స్‌ జాబితాలో ఉన్న దివ్యాంగ అభ్యర్థులకు డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసిన విద్యార్థులను మాత్రమే స్క్రైబ్స్‌గా కేటాయించాలి. వీహెచ్‌, ఓహెచ్‌ (రెండు చేతులు లేనివారు) అభ్యర్థులకు 50 నిముషాల అదనపు సమయం కేటాయిస్తారు.

అభ్యర్థులతో పాటు

ప్రభుత్వ టీచర్లకూ తప్పనిసరి పరీక్ష

ఈ నెల 5 నుంచి 16 వరకు

పరీక్షల నిర్వహణ

జిల్లాలో 6 సెంటర్లలో పరీక్షలు

రాయనున్న 18,191 మంది అభ్యర్థులు

ఏర్పాట్లు సిద్ధం చేశాం

టెట్‌ నిర్వహణకు జిల్లాలోని సెంటర్లలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశాం. ఇబ్బంది పడకుండా అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.

– శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement