అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కర్షకలోకం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. చూస్తుండగానే మృగశిర, ఆరుద్ర, పునర్వసు లాంటి మంచి విత్తన కార్తెలు కరిగిపోయాయి. అదను దాటిపోతుందనే ఆందోళనతో అడపాదడపా కురిసిన అరకొర వర్షాలకే అరకొర తేమలోనే కొంతవరకు పంటలు సాగు చేశారు. నెలల పాటు వర్షాభావం, 15 నుంచి 20 కిలోమీటర్ల బలమైన గాలులుకు సాగు చేసిన పంటలు కూడా చేతికిరాకుండా పోతుండటంతో రైతు ఇంట ఆందోళన నెలకొంది.
కూలిన ఖరీఫ్ ఆశలు..
ఎల్–నినో తీవ్రత, నైరుతి నిరాశల మధ్య అన్నదాత ఖరీఫ్ ఆశలు కళ్లముందే అడియాసలయ్యాయి. జూన్ 6న నైరుతి ప్రవేశించాక తొలుత రుతుపవనాలు కొంత ప్రభావం చూపడంతో మొదటి పక్షంలో మోస్తరుగా వర్షాలు కురిశాయి. పంటలు సాగు చేద్దామని పొలం బాట పట్టారు. జూన్ 15 తర్వాత రుతుపవనాలు మందగించి ఎల్–నినో ప్రభావం చూపడంతో వర్షం జాడ కరువైపోయింది. జూలై ఆఖరు వరకు ప్రధాన పంటల సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నా.. దాదాపు ఆ గడువు కూడా ముగిసేదశకు చేరుకుంది. 3.43 లక్షల హెక్టార్లు అంచనా వేయగా ప్రస్తుతానికి 1.05 లక్షల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. పంటల సాగు ఈ స్థాయిలో పతనం కావడం గత 50 ఏళ్ల జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షాలకు కంది సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 1.20 లక్షల హెక్టార్లకు కాస్త ఇటుగా విస్తీర్ణం రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని భావిస్తున్నా.. దాదాపు 2.30 లక్షల హెక్టార్లలో సాగులోకి రావడం ఆషామాషీ కాదు. దీంతో ఈ సారి వేలాది హెక్టార్లు క్రాప్ హాలిడే ప్రకటించినా ఆశ్యర్యపోనవసరం లేదు.
25 వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ
విత్తన ప్రణాళిక..
వ్యవసాయశాఖ 25 వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక ప్రభుత్వానికి పంపింది. 10,215 క్వింటాళ్ల ఉలవలు, 5,565 క్వింటాళ్ల కందులు, 2,670 క్వింటాళ్ల జొన్నలు, 2,620 క్వింటాళ్ల జొన్నలు, 2,206 క్వింటాళ్ల అలసందలు, 500 క్వింటాళ్ల ఆముదం, 500 క్వింటాళ్ల కొర్రలు.. ఇలా 80 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెబుతున్నారు.
దెబ్బతీసిన ‘జూలై’
జూలైలో కురవాల్సిన వర్షాలు రైతును భారీగా దెబ్బతీశాయి. జూన్‌లో ఎలాగోలా సాధారణ వర్షం కురిసినా.. కీలకమైన జూలైలో 63.4 మి.మీ గానూ కేవలం 17.6 మి.మీ నమోదైంది. ఈ 25 రోజుల్లో కేవలం ఒకే ఒక్క వర్షపు రోజు (రెయినీ డే) నమోదు కావడం, 32 మండలాల్లో సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదు కావడంతో ఖరీఫ్ సాగు పడకేసింది. ఓవరాల్‌గా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 118.3 మి.మీ గానూ 27 శాతం లోటుతో 86 మి.మీ వర్షం కురిసింది. దీంతో కేవలం పెద్దవడుగూరు, వజ్రకరూరు, బెళుగుప్ప, గుత్తి మినహా మిగతా మండలాల్లో పంటల విస్తీర్ణం భారీగా పడిపోయింది. ప్రధానంగా వేరుశనగ పంట సాగులోకి వచ్చే రాయదుర్గం, కళ్యాణదుర్గం డివిజన్లలో వర్షాలు లేక వేలాది హెక్టార్లు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. గుమ్మఘట్ట మండలంలో 13,400 హెక్టార్లు అంచనా వేయగా 300 హెక్టార్లకు మించి పంటలు సాగుచేయని దుస్థితి నెలకొంది. రాయదుర్గంలో 16,875 హెక్టార్లకు గానూ 700 హెక్టార్లు, పుట్లూరులో 4 వేల హెక్టార్లకు గానూ 150 హెక్టార్లు, కణేకల్లులో 16,303 హెక్టార్లకు గానూ 900 హెక్టార్లు.. ఇలా చాలా మండలాల్లో 10 నుంచి 20 శాతం విస్తీర్ణంలో పంటలు వేయగా..మిగతా 80 శాతం పొలాలు బీళ్లుగా ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఎల్–నినో తీవ్రత, నైరుతి నిరాశల మధ్య పడకేసిన ఖరీఫ్
జిల్లా చరిత్రలో తొలిసారిగా భారీగా పతనమైన పంటలు
2.30 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయం ఆషామాషీ కాదు
25 వేల క్వింటాళ ్ల ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక ఎప్పుడో?


