అనంతపురం అర్బన్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నా తమకు ఆస్తులు ఉన్నట్లు చూపడంతో తల్లికి వందనం అందకుండా పోయిందని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలను సరిదిద్ది పథకం వర్తింపజేయాలని కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, రమేష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కిరణ్మయి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 697 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 302, తల్లికి వదనం, తదితర సమస్యలపై 395 అర్జీలు ఉన్నాయి. అంతకు ముందు వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు తృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. ఎల్–నినో కారణంగా తలెత్తనున్న తాగు, సాగునీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలన్నారు.


