● స్వేచ్ఛగా మా విధులు నిర్వహించలేం
● కలెక్టర్ సమక్షంలో నగరపాలక సంస్థ అధికారుల ఆవేదన
అనంతపురం క్రైం: నగరపాలక సంస్థలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు మూకుమ్మడిగా కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి నుంచి ఛీత్కారాలు, దూషణలు, అవమానాలతో విసిగిపోతున్నామని గత శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... నగరంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ఎందుకు జరగడం లేదని కలెక్టర్ ఆనంద్ ప్రశ్నించగా.. నగరపాలక సంస్థ అధికారులు అసలు పరిస్థితులను వివరించారు. అభివృద్ధి పనుల టెండర్ల నుంచి భూమిపూజల వరకు అన్నింటా రాజకీయ జోక్యం పెరిగిందని చెప్పారు. అధికార పార్టీ, ప్రజాప్రతినిధి ఆదేశాలను కాదని ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఇటీవల ఓ సహాయ ఇంజినీర్‌ను ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకుని అతని సెల్‌ఫోన్‌లోని వాట్సాప్ గ్రూపులు, సందేశాలను పరిశీలించిన అనంతరం తీవ్ర పరుష పదజాలంతో దూషించారని, బెదిరింపులకు దిగారని ప్రస్తావించారు. అధికారుల సాదకబాధలు విన్న కలెక్టర్ ఏం చేయాలో తెలియక కొంతసేపు మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది.
ఎలుగుబంట్ల దాడిలో రైతుకు గాయాలు
కళ్యాణదుర్గం రూరల్: ఎలుగుబంట్ల దాడిలో ఓ రైతు గాయపడ్డాడు. కంబదూరు మండలం లక్ష్మీపురం తండాకు చెందిన కృష్ణానాయక్ సోమవారం ఉదయం తన పొలంలో పని చేస్తుండగా రెండు ఎలుగుబంట్లు దూసుకొచ్చి దాడి చేశాయి. కృష్టానాయక్ గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంట్లు సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయాయి. గాయపడ్డ రైతును పక్క పొలంలో వారు గమనించి సీహెచ్‌సీకి తరలించారు. ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా బదిలీ
అనంతపురం సెంట్రల్: ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన మహబూబ్‌బాషాను చిత్తూరు ఏఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈయన మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీగా, అనంతపురం ఇన్‌చార్జ్ డీఎస్పీగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. బదిలీ నేపథ్యంలో త్వరలోనే రిలీవ్ కానున్నారు.
అనంతపురం డీఎస్పీగా చంద్రశేఖర్
అనంతపురం డీఎస్పీగా మాగాల చంద్రశేఖర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈయనది నగరంలోని సున్నపుగేరు ప్రాంతం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక్కడ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.
పదోన్నతులకు ఆమోదం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పాలకమండలి సమావేశం సోమవారం వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులు నేరుగా, ఎక్స్ అఫిషియో అధికారులు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలకు అమోదం తెలిపారు. ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. కెరీర్ అడ్వాన్సెమెంట్ స్కీం (సీఏఎస్) కింద పదోన్నతికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న మినిమం స్కేలు ఉద్యోగులకు నెలకు రూ.4 వేల జీతం పెంపుదలకు పాలకమండలి సమ్మతించింది. అకడమిక్ అసిస్టెంట్లు, టీచింగ్ అసిస్టెంట్లు, అడ్‌హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అడ్‌హాక్ ప్రిన్సిపాల్స్ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలనే నిర్ణయాన్ని పాలకమండలి తిరస్కరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలే పదవీ విరమణ అని స్పష్టం చేసింది. దూరవిద్య విభాగం నుంచి బీఈడీ కళాశాలకు బదలాయించిన అధ్యాపకులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి దూరవిద్య విభాగంలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గత వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి హయాంలో పరీక్షల విభాగం ఉద్యోగులు నేరుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారనే కారణంతో సదరు ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ కోత విధించారు. తాజాగా ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కోత విధించకుండా ఇవ్వాలని పాలకమండలి ఆమోదం తెలిపింది.


