అప్పులు అధికమై ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పులు అధికమై ఆత్మహత్య

Jul 28 2026 12:37 AM | Updated on Jul 28 2026 12:37 AM

కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన అశోక్‌ కుమార్‌ రెడ్డి(40) అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. అలాగే పొలంలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కరెంట్‌ పనులు లేక, పంటలు సరిగా పండక అప్పులపాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

తండ్రి మందలించారని కుమారుడు..

యాడికి: మద్యానికి బానిసైన ఓ యువకుడు తండ్రి మందలించాడని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాడికి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలోని చౌడేశ్వరీ కాలనీకి చెందిన బద్దల రామ్మోహన్‌, బద్దల కృష్ణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అజయ్‌కుమార్‌ (23) ఉన్నారు. ఇటీవల అజయ్‌ కుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. తండ్రిని ఆదివారం రాత్రి కొంత డబ్బు ఇవ్వాలని అడిగాడు. ‘ఇంత కాలం నీవు ఏ పని చేయకున్నా మేమే నెట్టుకొస్తున్నామం’టూ తండ్రి కుమారుడిపై ఆగ్రహం చేయగా.. మనస్తాపానికి గురైన అజయ్‌కుమార్‌ గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రామ్మోహన్‌ ఫిర్యాదు కేసు నమోదు చేశారు. అజయ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement