అనంతపురం ఎడ్యుకేషన్: ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఇతర పాఠశాలలకు పంపించడంతో పలు సబ్జెక్టులకు బోధన పూర్తిగా దెబ్బతిని విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ, గణితం వంటి కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌ఏ–1 పరీక్షలు సమీపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించకపోవడంతో చదువులకు తీవ్ర విఘాతం ఏర్ప డింది. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు టీసీలు తీసుకుని ఇతర పాఠశాలలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆగస్టు 3 నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
1,090 మంది విద్యార్థినులు.. 26 మంది టీచర్లు
శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో మొత్తం 35 టీచరు పోస్టులు ఉండగా ప్రస్తుతం 26 మంది విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 1,090 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హిందీ బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే ఉండగా, గణితంలో ఆరు పోస్టులకు ఇద్దరే పని చేస్తున్నారు. దీంతో 9వ, 10వ తరగతుల్లో రెండు సెక్షన్లను కలిపి 120 మంది విద్యార్థినులకు ఒకేసారి పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ పూర్తిగా కరువైంది.
హెచ్‌ఎం సొంత ఖర్చుతో బోధన
15వ వార్డు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది తొలిసారిగా పదో తరగతి ప్రారంభమైంది. సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ హిందీ బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయురాలు తన సొంత డబ్బుతో ప్రైవేట్ హిందీ ఉపాధ్యాయుడిని నియమించి బోధన కొనసాగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇతర పాఠశాలల్లోనూ అంతే..
రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలల్లో కూడా హిందీకి ఒక్కో ఉపాధ్యాయుడే ఉన్నారు. ఇతర సబ్జెక్టుల్లోనూ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధన అస్తవ్యస్తంగా సాగుతోంది. నగర పరిధిలోనే సుమారు 30 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
భర్తీలు మాత్రం లేవు
గత ఏడాది క్లస్టర్ విధానంలో సర్‌ప్లస్‌గా ఉన్న ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేసి 6, 7 తరగతులకు బోధన చేయించారు. అయితే తాజా సర్దుబాటులో ఉన్నత పాఠశాలల్లో ఎస్జీటీలు ఉండకూడదనే నిబంధనతో వారిని ఇతర పాఠశాలలకు పంపించారు. దీంతో సమస్య మరింత తీవ్రమైంది. ఖాళీలను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తామని, జూన్ 30 నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా నియామకాలపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 30 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఇతర ప్రాంతాలకు పంపించడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
ఎఫ్‌ఏ–1 పరీక్షలు ఎలా రాయాలి?
ఆగస్టు 3 నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. అయితే సబ్జెక్టు ఉపాధ్యాయులే లేకపోతే విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గణితం, హిందీ వంటి సబ్జెక్టుల్లో బోధన సక్రమంగా జరగకపోవడం విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడం ద్వారా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, హెచ్‌ఎంలు కోరుతున్నారు.
టీచర్ల కొరతతో నగరపాలక పాఠశాలల్లో అటకెక్కిన చదువులు
వందలాదిమంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడితో బోధన
హిందీ, గణితంలో తీవ్ర కొరత
ఎఫ్‌ఏ–1 పరీక్షల వేళ
విద్యార్థుల ఆందోళన
జాడలేని అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల భర్తీ


