అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 45వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. భువన విజయం ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ ముఖ్య అతిథిగా, శలాక రఘునాథ శర్మ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు.
● విజయనగర రాజుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు పేరున 1981 జులై 27న విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎస్వీయూ అనుబంధంగా 1968లో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1976లో స్వయంప్రతిపత్తి హోదా లభించింది. 1981లో పూర్తిస్థాయి వర్సిటీగా రూపాంతరం చెందింది. ఎస్కేయూలో చదివిన పలువురు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు, మాజీ డీజీపీ జేవీ రాముడు ఎస్కేయూలో పీజీ చదివారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాద్ రావు ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మాజీ డీజీపీ అరవింద రావు ఇంగ్లిష్ విభాగంలో పీజీ చదివారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రెడ్డి ఎస్కేయూలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఇలా ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు.
మిద్దైపె నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడి మృతి
రాయదుర్గంటౌన్: ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి పడి మృతి చెందాడు. ఎస్‌ఐ సురేష్ తెలిపిన మేరకు.. పట్టణంలోని కణేకల్లు రోడ్డు ఎంఏసీ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న జాకీర్ హుస్సేన్ (53) ఆదివారం స్థానిక నేసేపేటలో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. సాయంత్రం మరో మిద్దైపె సామాన్లు ఉంచేందుకు ప్రయత్నిస్తుండగా, కాలు జారి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సోమవారం ఉదయం మృతదేహానికి రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది.
ట్రాక్టర్‌పై నుంచి పడి రైతు..
కూడేరు: ట్రాక్టర్‌పై నుంచి పడి రైతు మృతి చెందిన ఘటన కూడేరు మండలం కొర్రకోడులో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన బోయ రామన్న (60) తన పశువులకు గ్రాసం కోసం వేరే రైతుతో వేరుశనగ పొట్టు కొనుగోలు చేశాడు. పొట్టును తన పొలంలోకి తరలించేందుకు ట్రాక్టర్ ట్రాలీలో కుప్ప పెడుతున్న క్రమంలో జారి కింద పడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: కొన్నేళ్లుగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం. వివరాలను సోమవారం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం రాజీవ్‌కాలనీకి చెందిన కుమ్మర సుబాష్ ఆచారి, నగరంలో ప్రియాంక నగర్‌కు చెందిన గోవిందయోగేష్, మరో ఇద్దరు మైనర్లు కలిసి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడేవారు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలను ఎంచుకున్నారు. నగరంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు ధర్మవరం, కడప, కొండాపురం, ముద్దనూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల ద్విచక్రవాహనాల దొంగతనాలపై త్రీటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో గుత్తిరోడ్డు మార్కెట్‌యార్డు సమీపంలో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.17.50 లక్షల విలువజేసే 24 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
అమ్మమ్మ ఊరికి వెళ్లి..
తిరిగి రాని లోకాలకు
శాంతిపురం: అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఓ బాలుడు తిరిగి రాని లోకాలకు చేరాడు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన సాత్విక్ (5) తన తల్లి దీపతో కలిసి కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సోమవారం ఇంటి అవసరాల కోసం రోడ్డు పక్కన ట్యాంకర్ నుంచి గ్రామస్తులు నీరు పడుతుండగా, తోటి చిన్నారులతో సరదాగా సాత్విక్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ టెంపో వీరిపై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన సాత్విక్‌ను కుప్పం ఏరియా ఆస్పత్రిఇకి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. టెంపో అంతకుముందు ఇద్దరిని ఢీకొనగా వారు కూడా మృతి చెందడం గమనార్హం.


