అనంతపురం సిటీ: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సొంత ఇలాకాలో ప్రభుత్వ వైద్య సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయి. వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్‌లు సైతం అందుబాటులో లేక సోమవారం రోగుల సంబంధీకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు.. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు రోగులను వారి కుటుంబసభ్యులు సోమవారం జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్‌లు అందు బాటులో లేకుండా పోయాయి. దీంతో ఎమర్జెన్సీ వార్డులోకి రోగిని చేర్చే క్రమంలో ఓ కుటుంబం అక్కడున్న వీల్ చైర్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మరో రోగి కుటుంబసభ్యులు వీల్‌చైర్‌ను తాము ముందే తీసుకున్నామంటూ వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ పట్టించుకోక పోవడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువైపులా మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ కిందామీద పడ్డారు. చివరకు ఔట్ పోస్టు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
వేడుకున్నా కనికరించని వైనం
మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది లెక్కలేని తనానికి అద్దం పట్టే మరో ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. రెండు కాళ్లూ విరిగి పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని తరలించేందుకు వీల్‌చైర్ కాని, స్ట్రెచ్చర్ కాని సమకూర్చడంలో వైద్య సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం కనబరిచారు. గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో చివరకు కుటుంబసభ్యులు తమ భుజాల సాయంతో రోగిని ఎమర్జెన్సీ వార్డు నుంచి నడిపించుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
స్పందించని యాజమాన్యం
సాధారణంగా ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే రోగులు పూర్తి అసహాయ స్థితిలో ఉంటారు. వీరిని వార్డులోకి తరలించాలంటే వీల్‌చైర్, స్ట్రెచ్చర్‌లు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎమర్జెన్సీ వార్డులో భూతద్దం పెట్టి వెదికినా వీల్‌చైర్, స్ట్రెచ్చర్ కనిపించవు. దీంతో రోగులను వార్డులోకి కుటుంబసభ్యులు మోసుకెళ్లాల్సి వస్తోంది. వార్డులో ఉన్న వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్‌లను ఖాళీ డబ్బాలు తరలించడానికి, ఇతర బయో మెడికల్ వ్యర్థాలను తరలించేందుకు వార్డుబాయ్‌లు తీసుకెళుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఆక్సిజన్ సిలిండర్లు, స్టోర్ రూమ్ నుంచి మందులను వార్డులోకి తరలించాలంటే వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్లు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా యాజమాన్యం కనీస ఆలోచన కూడా చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మేడమ్ గారు బిజీగా ఉన్నారు
జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డు వద్ద సోమవారం చోటు చేసుకున్న రెండు ఘటనలపై సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ పయత్నించగా, ఆమె చాంబర్ ఎదుట ఉన్న సిబ్బంది నిరాకరించారు. ‘మేడమ్ గారు బిజీగా ఉన్నారు. మీరు మళ్లీ రండి’ అంటూ బుకాయించారు. మేడమ్‌ను ఎందుకు కలవాలనుకుంటున్నారో ముందుగా తమకు తెలపాలని, లేకపోతే లోపలికి అనుమతించేది లేదంటూ స్పష్టం చేశారు.


