కుందుర్పి: కుందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో ఎలాంటి రుణమూ తీసుకోకపోయినా క్రాప్‌లోన్ తీసుకున్నారంటూ ఖాతాను హోల్డ్‌లో పెట్టడంతో మనస్తాపం చెందిన నాగేంద్ర, చంద్రకళ దంపతులు సోమవారం బ్యాంకు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం మందలపల్లికి చెందిన హనుమంతరాయప్ప పెద్దకుమారుడు నాగేంద్ర 20 ఏళ్ల క్రితమే తండ్రి నుంచి విడిపోయి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాగేంద్ర భార్య చంద్రకళకు కెనరా బ్యాంకులో ఖాతా ఉంది. ఈమె ఎలాంటి రుణమూ తీసుకోలేదు. అయితే.. మామ హనుమంతరాయప్ప రూ.3.75 లక్షల పంట రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదన్న నెపంతో చంద్రకళ ఖాతాను హోల్డ్‌లో పెట్టారు. ఇటీవల చంద్రకళ ఖాతాలో తల్లికి వందనం డబ్బు రూ.26 వేలు జమ అయ్యింది. సోమవారం బ్యాంకుకు వెళ్లి డబ్బు ఇవ్వాలని కోరగా.. మీ మామ పేరిట క్రాప్‌లోన్ ఉన్నందున ఇవ్వడం కుదరదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. తాము 20 ఏళ్ల క్రితమే ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ఇతర ప్రాంతాల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, వారి రుణాలతో తమకు సంబంధం లేదని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. దీంతో చంద్రకళ, ఆమె భర్త నాగేంద్ర మనస్తాపానికి గురై బ్యాంకు ముందు వందలాది మంది చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రైతులు, బ్యాంకు సిబ్బంది వారిని కాపాడారు. ఆ తర్వాత చంద్రకళ ఖాతాను హోల్డ్ నుంచి తొలగించి డబ్బు ఇస్తామని తెలపడంతో వారు వెనుదిరిగారు.


