అనంతపురం అర్బన్: కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విదార్థుల ప్రతిభ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. సంపూర్ణ రామాయాణాన్ని వినూత్నంగా మట్టికుండలపై ప్రదర్శించి ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ ఓ.ఆనంద్‌ను సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. పాఠశాల ఆంగ్లభాష ఉపాధ్యాయురాలు డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ సంపూర్ణ రామాయణంలోని ఏడు ఖండాలను, 20 మార్కులు ఉన్న పాఠ్యాంశాన్ని 20 కుండలపై చిత్రీకరించడం (వర్లీ ఆర్ట్ పెయింటింగ్) ద్వారా రికార్డు సాధించారన్నారు. స్కూల్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ స్పెషల్ ఎడ్యుకేటర్, సైకాలజిస్ట్ సాయి దీపిక ప్రోత్సాహం అందించారన్నారు. కార్యక్రమంలో జేసీ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ ఎ.మలోల, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, విద్యార్థులు రక్షిత, సౌజన్య, సుప్రజ, హేమంత్, తరుణ్ తేజ, సురేఖ, శ్రీలేఖ, తదితరులు పాల్గొన్నారు.
రౌడీషీటర్ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: యువకుడిపై దాడి చేసిన రౌడీషీటర్ సుధీర్ అలియాస్ పులి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో ఉమానగర్‌కు చెందిన రౌడీషీటర్ దాసరి సుధీర్ ఈనెల 23న పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో మహమ్మద్ ఫైజాన్ అహ్మద్‌పై కర్రతో దాడి చేశాడు. దీంతో ఫైజాన్ ముక్కు వద్ద తీవ్ర గాయమైంది. ఎముక విరిగింది. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం నిందితున్ని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు పంపామన్నారు.
డీటీ ప్యానల్ విడుదల
అనంతపురం అర్బన్: తహసీల్దారు పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 92 మందితో డీటీ (డిప్యూటీ తహసీల్దార్) ప్యానల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వారంలోగా సమర్పించాలని సూచించింది. 2018–19కు సంబంధించి 15 మంది డీటీలు, 2019–20కు 16 మంది, 2020–21కు 31 మంది, 2021–22కు ముగ్గురు, 2022–23కు 18 మంది, 2023–24కు నలుగురు, 2024–25కు సంబంధించి ఐదుగురు మొత్తం 92 మందితో ప్యానల్ విడుదల చేసింది.


