అనంతపురం అర్బన్: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాకంటక పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఎన్‌టీఏ వ్యవస్థ రద్దు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ నిరసన చేపట్టింది. కార్యక్రమానికి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యలపై గళమెత్తిన వారిని అరెస్టు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, బెదిరింపులు వంటి దుర్మార్గపు చర్యలకు మోదీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసులు క్రూరంగా దాడి చేయడంతో పాటు తప్పుడు కేసులు బనాయించడం అన్యాయమన్నారు. తక్షణం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారని, ఇలాంటి వారి చేతుల్లో విద్యారంగం నాశనమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో 43 వేల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో విద్యార్థులకు మతోన్మాదాన్ని నూరిపోస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, జిల్లా నాయకులు టి.నారాయణస్వామి, మల్లికార్జున, శ్రీరాములు, రాజేష్‌గౌడ్, లింగమయ్య, రమణయ్య, పద్మావతి, సంతోష్‌కుమార్, కృష్ణుడు, చిరంజీవి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ


