అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీహెచ్) ఆర్.దేవానందకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ అయ్యారు. అక్కడ ఏపీఎంఐపీ పీడీగా ఉన్న సుదర్శన్ గత నెలలో ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో డిప్యుటేషన్ కింద దేవానంద్‌కుమార్‌ను బదిలీ చేస్తూ బుధవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జ్ పీడీగా ఏపీఎంఐపీ ఏపీడీ బీసీ ధనుంజయ పనిచేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామానికి చెందిన ఆశ (25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి కర్ణాటకలోని చిన్న ఓబనహళ్లి గ్రామానికి చెందిన ఆశతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వన్నూరుస్వామి మంగవారం రాత్రి మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. రోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆశ ఇంట్లో ఉరివేసుకుంది. ఇంటి బయట నిద్రించిన వన్నూరుస్వామి బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించిన భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
పుట్లూరు: మండలకేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన మల్లేశ్వరి (40) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ సురేంద్రబాబు తెలిపిన మేరకు.. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మల్లేశ్వరి జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై బుధవారం మృతురాలి కుమారుడు నాగశివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డబ్బుల కోసం యూట్యూబర్ వేధింపులు
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్
గుంతకల్లు: డబ్బుల కోసం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న యూట్యూబర్ మంజునాథనాయుడుపై బుధవారం గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ షామీర్‌బాషా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. మంజునాథనాయుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించి బ్లాక్‌మెయిల్ చేయడంతోపాటు విధులకు అడ్డు తగులుతున్నాడని షామీర్‌బాషా పేర్కొన్నారు. అడిగినంత ఇవ్వని పక్షంలో లేనిపోని ఆరోపణలతో వీడియోలు చేసి సోషియల్ మీడియా ద్వారా వైరల్ చేస్తానని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. 2023లో కూడా ఇదే విధంగా బెదిరించగా, జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మంజునాథనాయుడుపై కేసు నమోదు చేయాలని కోరారు. స్పందించిన ఎస్పీ జగదీష్ విచారణ చేపట్టాలని టూటౌన్ సీఐ వంశీకృష్ణను ఆదేశించారు


