బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి వాసులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూపకల్పనకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృషి చేశారు. 2021లో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీడిపల్లివాసుల సమస్యను విన్నవించి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)కు ఆమోదం పొందారు. అదే యేడాది అక్టోబర్ 14న గ్రామసభ ఏర్పాటు చేయించి యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున గ్రామస్తులతో ఆమోద ముద్ర వేయించారు. మొత్తంగా 657 యూనిట్లకు సంబంధించి రూ.131.20 కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపించారు. అయితే, ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిధులు మంజూరు కాలేదు.
అభివృద్ధి గగనం,పథకాలు దూరం
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించి గెజిట్ ఉండడంతో జీడిపల్లి గ్రామంలో అబివృద్ధి పనులు జరగడం లేదు. సీసీ రోడ్ల నిర్మాణం ఊసేలేకుండా పోయింది. గ్రామానికి ఆర్టీసీ బస్సు రాక 20 సంవత్సరాలు గడిచింది. హౌసింగ్ స్కీమ్‌కు కూడా జీడిపల్లివాసులు దూరమయ్యారు. గ్రామంలో ఊట నీటితో విష పురుగుల బెడద ఎక్కువైంది. అధిక తేమ శాతం కారణంగా తరచూ విద్యుత్ అర్త్ అవుతుండడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు విద్యుదాఘాతంతో మరణించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అర్హుల జాబి తాలోని పది మంది వరకూ కాలం చేయడం గమనార్హం. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కారణంగా ఉంటామో లేదో తెలియకపోవడంతో గ్రామంలో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక.. రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తమ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా మొర ఆలకించడం లేదని జీడిపల్లివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
వివరాలు ప్రభుత్వానికి పంపాం
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల గ్రామంలో వివరాలు సేకరించాం. ఓటీఎస్ జాబితాలో 657 మందిని చేర్చాం. వివరాలను రెవెన్యూశాఖ ద్వారా ప్రభుత్వానికి పంపాం.
– వసంతబాబు,
కళ్యాణదుర్గం ఆర్‌డీఓ
పునరావాసం కల్పించాలి
జీడిపల్లి వాసులు దశాబ్ద కాలంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పటికై నా డబ్బును వారి ఖాతాలకు జమ చేయాలి. ఊటనీటి బాధలను అధిగమించడానికి నివేశ స్థలాలు, ఇళ్లకు ప్యాకేజీ వర్తింపచేసి పునరావాసం కల్పించాలి.
– చిన్న మచ్చన్న, వైఎస్సార్‌సీపీ
బెళుగుప్ప మండల కన్వీనర్
పయ్యావుల కేశవ్ చొరవ చూపాలి
జీడిపల్లి గ్రామస్తులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందకపోవడం పాలకుల నిర్లక్ష్యమే. ఈ విషయంపై ఆర్థికశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి. నిధులను విడుదల చేసి స్థానికులను ఆదుకోవాలి.
– బీ.హనుమంతరాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు


