వరుస ఘటనలు.. పోలీసులకు సవాళ్లు | - | Sakshi
Sakshi News home page

వరుస ఘటనలు.. పోలీసులకు సవాళ్లు

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

● బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఎస్‌బీఐ ఏటీఎం (ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌)ను దొంగలు అపహరించారు. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంతో పాటు తాడిపత్రి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మెషీన్‌ను బొలెరో సాయంలో పెకలించుకొని వెళ్లి శింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీప పొలాల్లో పడేసి నిప్పు పెట్టారు. దాదాపు రూ.10 లక్షల నగదు పోయి ఉంటుందని భావిస్తున్నారు.

● ఈ నెల 13న గుంతకల్లులో రద్దీగా ఉండే ట్రావెల్స్‌ బంగ్లా సర్కిల్‌లో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ చోరీకి విఫలయత్నం జరిగింది. అర్దరాత్రి సమయంలో బొలెరో వాహనం సహాయంతో మిషన్‌ను లాగడంతో పెద్దగా శబ్దం వచ్చింది. దీంతో సమీపంలో ఓ వ్యక్తి లేచి గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు.

అనంతపురం సెంట్రల్‌: నగదుతో కూడిన బ్యాంకు ఏటీఎంలను కొల్లగొట్టే నార్త్‌ గ్యాంగ్‌ (ఉత్తరాది ముఠా)లు జిల్లాలో తిష్ట వేశాయి. పోలీసుల నిఘా లేని ప్రదేశాలను ఎంచుకుని పలు చోట్ల ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నాయి. గుంతకల్లు, బుక్కరాయసముద్రం, తాడిపత్రితో పాటు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ ఈ తరహా దొంగతనాలు జరిగాయి. ఈ ఘటనలన్నీ ఒకటే గ్యాంగ్‌ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాజస్తాన్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన దొంగలే ఈ తరహా నేరాలకు పాల్పడతారని భావిస్తున్నారు.

నిఘా వైఫల్యంతోనే ..

జిల్లాలో రాత్రి సమయాల్లో పోలీసుల నిఘా ఏ మాత్రం ఉండడం లేదు. నేరాలు జరిగినప్పుడు హడావుడి తప్ప.. తక్కిన సమయంలో ఎలాంటి తనిఖీలు చేసే పరిస్థితి లేదు. కనీసం తీవ్రమైన నేరం జరిగినప్పుడు కూడా మేల్కోవడం లేదు. తొలి ఏటీఎం కేంద్రంపై దొంగతనానికి యత్నించినప్పుడు నిఘా వ్యవస్థలను పటిష్టం చేస్తే పునరావృతం కాకుండా ఉంటాయి. ఆ స్థాయిలో దృష్టి సారించకపోవడం వలన వరుస ఏటీఎం దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం పోలీసు అధికారులు స్టేషన్లలో తిష్ట వేసి పంచాయితీలకే పరిమితమవుతున్నారు. లేదంటే రోడ్లపైకి వచ్చి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి మందుబాబులు తాగింది దిగేలా రూ.10వేల చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. అంతే తప్ప నేరాల కట్టడిపై పోలీసులు దృష్టి సారించడం లేదు. ఇదే దొంగలకు కలిసి వస్తోంది. పక్కా స్కెచ్‌తోనే రంగంలోకి దిగుతున్నారు. ముందు రోజు ప్లాన్‌ రెడీ చేసుకోవడం.. తర్వాత అమలు చేయడం జరిగిపోతోంది. మొత్తం ఈ టీం సభ్యులు ఐదుగురులోపే ఉంటారని తెలుస్తోంది. ఒక బొలెరో సాయంతోనే ఏటీఎం దొంగతనాలు చాకచక్యంగా చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి తొలుత లోపలికి వెళ్లి సైరన్‌ మోగే వైర్లను కట్‌ చేస్తారు. తర్వాత బొలెరో వాహనం సాహయంతో ఏటీఎం కేంద్రాన్ని పెకలించేస్తారు. దర్జాగా బొలెరో వాహనంలో తీసుకుపోయి అందిన కాడికి దోచుకుంటున్నారు.

భద్రతపై నిర్లక్ష్యం

బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, బంగారు దుకాణాలు తదితర ప్రాంతాల చోట సీసీ కెమెరా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఇటీవల కాలంలో సాధారణ ప్రజల ఇళ్లకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ రూ.లక్షలు, కోట్లు విలువైన డబ్బు, ఇతరత్ర వస్తువులు ఉన్న ప్రదేశాల్లో పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇందుకు నిదర్శనమే బుక్కరాయసముద్రం ఎస్‌బీఐ ఏటీఎం దొంగతనం. సదరు కేంద్రంలో ఎలాంటి సీసీ కెమెరా, అలారం వ్యవస్థ లేకపోవడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ప్రతి ఏటీఎం కేంద్రానికీ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేవారు. ఇటీవల కాలంలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తొలగించారు. కనీసం సీసీ కెమెరా, అలారం వ్యవస్థ అయిన పటిష్టంగా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి.

దొంగలను పట్టుకుంటాం : ఎస్పీ

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం దొంగతనం జరిగిన ఘటనా స్థలాన్ని ఎస్పీ జగదీష్‌ పరిశీలించారు. జిల్లాలో కొద్దిరోజులుగా ఇదే తరహా ఏటీఎం దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దొంగతనాలను చాలెంజింగ్‌ తీసుకొని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మీడియాకు వెల్లడించారు.

జిల్లాలో నార్త్‌ గ్యాంగ్‌ తిష్ట!

ఏటీఎంలే లక్ష్యంగా చోరీలు

గుంతకల్లులో దొంగతనాన్ని

ఛేదించే పనిలో ప్రత్యేకబృందం

అంతలోనే బుక్కరాయసముద్రంలో మరో దొంగతనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement