ప్రకృతి సాగుతో దేశానికే ఆదర్శంగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుతో దేశానికే ఆదర్శంగా నిలవాలి

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

అనంతపురం న్యూటౌన్‌: ప్రకృతి వ్యవసాయంతో మేలైన పంట దిగుబడులు సాధించి జిల్లా రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవం సందర్భంగా యాక్షన్‌ఫ్రాటెర్నా –ఎకాలజీ సెంటర్‌ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రస్తుతం జిల్లాలో 85 వేల ఎకరాల్లో సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వచ్చే ఏడాదికి 2 లక్షల ఎకరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ను 2 లక్షల ఎకరాల్లో అమలు చేయడమే లక్ష్యమన్నారు. యాక్షన్‌ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వి. మల్లారెడ్డి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము జిల్లాలోని 12 గ్రామాల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ సంరక్షకురాలు ఆర్‌. యశోదాబాయి మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత ఎక్కువగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. జూలై 1 నుంచి నాటేందుకు అటవీ శాఖ 10 లక్షల మొక్కలు సిద్ధం చేసిందన్నారు. ముందుగా కలెక్టర్‌ ఆనంద్‌ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంట విధానాల ప్రదర్శన, వ్యవసాయ నమూనాల స్టాళ్లను సందర్శించారు. నిజవల్లి గ్రామానికి చెందిన బాలవర్ధన్‌, పి.యాలేరు గ్రామానికి చెందిన శ్రీలత, అపిలేపల్లికి చెందిన అతాఉల్లా వంటి సహజ వ్యవసాయ రైతులు తమ అనుభవాలు, విజయగాథలను సదస్సులో వివరించారు. కార్యక్రమంలో డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ గురుప్రభాకర్‌, డ్వామా పీడీ సలీం బాషా, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌. సాలు రెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి. రఘునాథ రెడ్డి, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్‌ బాబు, నాబార్డ్‌ డీడీఎం కె.అనూరాధ, సీటీవో లక్ష్మానాయక్‌, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం మిల్లెట్స్‌ శాస్త్రవేత్త నర్సింహులు, వైఎస్సార్‌ సీపీ రాయలసీమ అధికార ప్రతినిధి కె.వి. రమణ, పర్యావరణ ప్రేమికులు భాషా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement