‘సర్‌’ కుట్రలను తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ కుట్రలను తిప్పికొట్టాలి

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) పేరుతో చేస్తున్న ఓటు తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన బుధవారం పాత ఆర్‌డీఓ కార్యాలయ ఆవరణలో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన సదస్సుకు రాంభూపాల్‌తో పాటు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్‌, సీపీఎం సీనియర్‌ నాయకుడు జి.ఓబుళు, రాష్ట్ర ముతవల్లిల అధ్యక్షుడు షకిల్‌ షఫీ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మొదటి విడతలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘ఎస్‌ఐఆర్‌’ నిర్వహించి 5.50 కోట్ల ఓట్లను తొలగించారన్నారు. ఇందులో 50 శాతం ముస్లిం మైనారిటీలవే ఉన్నాయన్నారు. రెండో దశలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహించి మరో 10 కోట్ల ముస్లిం, క్రిస్టియన్‌ ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపు జరిగితే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలనూ తొలగించే ప్రమాదం ఉందన్నారు. మునుముందు పౌరసత్వాన్ని కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల మోదీ పరిపాలనలో చెప్పుకోదగ్గ ఒక్క మంచిపనీ లేదన్నారు. మన ఓట్లను మనమే కాపాడుకోవాలన్నారు. ఇంటి వద్దకు బీఎల్‌ఓలు వచ్చినప్పుడు ప్రజలు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఇమామ్‌, వలి, ప్రకాష్‌, ముత్తుజ, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement