● బీకేఎస్‌లో దోపిడీ దొంగల బీభత్సం
● ఎస్‌బీఐ ఏటీఎం అపహరణ
● పొలాల్లో ధ్వంసం చేసి రూ.15.84 లక్షల దోపిడీ
బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రంలో దోపిడీ దొంగలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏకంగా ఎస్‌బీఐ ఏటీఎంను వాహనంలో ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. బీకేఎస్‌లోని అనంతపురం– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ పగలు చాలా రద్దీగా ఉంటుంది. దీనికి వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. రహదారిపై బ్రిడ్జి పనులు జరుగుతుండడంతో వాహనాలు కూడా ఏటీఎం ఎదుట నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది.
ఐదు నిమిషాల్లోనే దోపిడీ
రద్దీ ప్రాంతంలోని ఎస్‌బీఐ ఏటీఎంను దుండగులు కేవలం ఐదు నిమిషాల్లోనే దోపిడీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాహనం వెనుక భాగాన ముందుగానే తాడు కట్టుకుని అక్కడికి చేరుకున్నారు. వాహనం నుంచి ఒకరు దిగి ఏటీఎం సెంటర్ గ్లాస్ డోర్లను పగలగొట్టాడు. ఏటీఎంకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు తొలగించాడు. తర్వాత వాహనాన్ని రివర్స్ చేశారు. అందులో నుంచి మరొక వ్యక్తి దిగి వాహనంలోని తాడును ఏటీఎంకు కట్టాడు. ఇదే సమయంలో అంబులెన్స్, టూరిస్ట్ వాహనం, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సదరు వాహనం ముందు నుంచే వెళ్తున్నా దోపిడీ తీరును గుర్తించకపోవడం గమనార్హం. దుండగులు ఏటీఎంకు తాడు కట్టిన తర్వాత వాహనంతో లాగారు. ఏటీఎం గది నుంచి బయట పడడంతో వెంటనే వాహనంలోకి ఎత్తారు. ఈ పనంతా ఐదు నిమిషాల్లోనే చేశారు. తర్వాత స్థానిక తేరుబజార్, కొట్టాలపల్లి, గోవిందపల్లి, రేగడి కొత్తూరు మీదుగా శింగనమల మండల పరిధిలోని ఆకులేడు గ్రామ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం ధ్వంసం చేసి.. అందులోని రూ.15.84 లక్షల నగదు దోచుకున్నారు. మిషన్‌పై పెట్రోలు పోసి తగులబెట్టారు. తర్వాత అదే వాహనంలో పారిపోయారు. ఏటీఎం దోపిడీ దృశ్యాలు ఇటీవల పెద్దమ్మ జాతర సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల ముఖాలు, వాహనం నంబరు సరిగా కనిపించలేదు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, బీకేఎస్ సీఐ సుబ్బ రాయుడు, సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు రాం ప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలసి పరిశీలించారు. ఏటీఎం చోరీ ఘటనలను త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు.
వాహనం సాయంతో ఏటీఎం చోరీకి పాల్పడుతున్న దొంగలు (సీసీ కెమెరా దృశ్యం)
దుండగులు ధ్వంసం చేసిన ఎస్‌బీఐ ఏటీఎం
నగదు తీసుకున్న తర్వాత ఏటీఎం మిషన్‌ను తగులబెట్టిన దృశ్యం


