కళ్యాణదుర్గం రూరల్: వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, మహిళల వార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలతో రోగులకు వైద్య సేవలు అందజేయాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఆవసరం ఉందని వైద్యులు తెలపడంతో.. త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం పట్టణ సమీపంలోని ఉన్న నగర వనాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఎరువుల అమ్మకాలపై కాల్‌సెంటర్
అనంతపురం అగ్రికల్చర్: ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, డీలర్లు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తికి వ్యవసాయశాఖ కార్యాలయంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు జేడీఏ సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కాల్‌సెంటర్ నంబర్ 83310 57714లో సిబ్బంది జి.ఆదినారాయణ, జి.రాఘవేంద్రరెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకుని యూరియా, డీఏపీ అమ్మకాలు సాఫీగా జరిగేలా సహకరించాలని కోరారు.
వ్యక్తిపై పోక్సో కేసు
గుత్తి రూరల్: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మంగళవారం గుత్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు వ్యక్తిని గతంలోనే తీవ్రస్థాయిలో మందలించారు. అయితే వారం రోజుల నుంచి తిరిగి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం శ్రీనివాసులుపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు.
మాతాశిశు మరణాలు నివారిద్దాం
అనంతపురం సిటీ: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తి స్థాయిలో నివారిద్ధామంటూ సంబంధిత వైద్యాధికారులకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఆరు శిశు మరణాలపై మంగళవారం తన చాంబర్‌లో సంబంధిత వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. శిశు మరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భస్థ ప్రారంభ దశ నుంచే నాణ్యమైన ప్రసూతి పూర్వ సేవలు అందించడం ద్వారా మాతాశిశు మరణాలను నివారించవచ్చన్నారు. అలాగే హైరిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా గర్భిణుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
సీఏఎస్ పోస్టుల భర్తీకి చర్యలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ) చైర్మన్, కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 16, సీఏఎస్ జనరల్ పోస్టులు 10 చొప్పున మొత్తం 26 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ఆసక్తి, తగిన అర్హత ఉన్న వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://ananthapuramu. ap. gov. in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.


