నాసిరకం విత్తనం అంటగట్టారు! | - | Sakshi
Sakshi News home page

నాసిరకం విత్తనం అంటగట్టారు!

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

ఇదీ సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ తీరు

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తన వేరుశనగ పంపిణీలో చాలాచోట్ల రైతులకు నాసిరకం అందాయి. పేరు కు 40 శాతం రాయితీ అంటున్నా బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్న ధరలకు ఏమీ తేడా లేదంటున్నారు. క్వింటా పూర్తి ధర రూ.10,200 ఖరారు చేసి, అందులో 40 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద క్వింటా రూ.6,120 ప్రకారం చెల్లిస్తున్నారు. ఒక్కో రైతుకు 30 కిలోల బస్తా రూ.1,816 ప్రకారం గరిష్టంగా మూడు బస్తాలు (90 కిలోలు) పంపిణీ చేస్తున్నా రు. నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే 9 శాతం లోపు తేమ ఉండాలని, ఫిజికల్‌ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు 4 శాతం లోపు, మొలకశాతం 70 శాతం పైన, ఇతరత్రా విత్తనాలు ఉండకూడదని నిబంధనలు పెట్టారు. ప్రధానంగా అవుటన్‌ 74 శాతం అంతకన్నా అధికంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నాణ్యతకు తిలోదకాలు

జిల్లాకు 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. గత ఖరీఫ్‌, రబీకి సంబంధించి సరఫరాదారులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు చెల్లించకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో విత్తన సమస్య తలెత్తింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో పరిమితంగా నిల్వలు ఉండటంతో వాటిని శుద్ధి చేసి ఆర్‌ఎస్‌కేలకు సరఫరా చేశారు. అయితే కేటాయింపుల మేరకు సేకరించాలని బలవంతం చేస్తుండటంతో ఎక్కడపడితే అక్కడి నుంచి నాణ్యత లేని చెనక్కాయలు తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించి నాసిరకం సేకరించారు. దీంతో కొన్ని మండలాలు, ఆర్‌ఎస్‌కేల నుంచి కాయలు బాగలేవని వాహనాలు వెనక్కి పంపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో దించుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ మండలానికి వచ్చిన వాటిలో కాయలు బాగలేనందున వాహనాల లోడును వెనక్కు పంపినట్లు ఏఓలు ‘సాక్షి’కి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, అవసరం మేరకు యూరియా, డీఏపీ పంపిణీ విషయంపై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు. చెనక్కాయలు బాగుంటే తమ ఖాతాల్లో వేసుకోవడం, నాసిరకమైతే అధికారులను నిందించడం చేస్తున్నారు. సకాలంలో బకాయిలు చెల్లించి ఉంటే నాణ్యమైన విత్తనాలు సేకరించే పరిస్థితి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

● కాగా జిల్లాకు కేటాయించిన 56 వేల క్వింటాళ్లలో ఆర్‌ఎస్‌కేలకు సరఫరా చేసింది 15 వేల క్వింటాళ్లు. అందులో రైతులకు పంపిణీ చేసింది 4 వేల క్వింటాళ్లలోపే కావడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement