కూడేరు: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని క్యాంప్ కమాండర్ మేజర్ భూమన్య అరుణ్ సూచించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్‌సీసీ నగర్‌లో కర్నూల్ గ్రూప్ వన్ ఆంధ్ర ఆధ్వర్యంలో సీఏటీసీ–5 ఎన్‌సీసీ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. మంగళవారం ఎన్‌సీసీ అధికారులు క్యాడెట్లకు డ్రిల్, వ్యాయామంపై శిక్షణ ఇచ్చారు. వ్యాయామం, డ్రిల్‌తో శరీర దృఢత్వం పెంపొందడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. దీంతో చురుకుదనం పెరిగి మనం ఎంచుకున్న రంగంలో రాణించి లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని క్యాంప్ కమాండర్ మేజర్ భూమన్య అరుణ్ తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ అడ్జుటెంట్ దాసరి సుధీర్, ఎన్‌సీసీ అధికారులు విజయ కుమార్, వెంకటేశ్వర్లు, అనీల్ కుమార్, కాశీం, రాజ్యలక్ష్మీ, ప్రతాప్, కేపీ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో బంగారు నగల అపహరణ
● 6 నెలల తర్వాత పోలీసులకు
ఫిర్యాదు చేసిన బాధితులు
అనంతపురం సెంట్రల్: ఇంట్లో బంగారు నగ లను అపహరించిన ఘటన నగరంలోని కోవూరునగర్‌లో జరిగింది. 6 నెలల తర్వాత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నాల్గో పట్టణ ఎస్‌ఐ కె.గోపి తెలిపిన మేరకు.. గతేడాది డిసెంబర్‌లో కోవూరునగర్‌లో నివాసముంటున్న మహబూబ్‌బాషా నివాసంలో దొంగతనం జరిగింది. బీరువాలో ఉంచిన 13.5 తులాల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని బాధితులు మంగళవారం నాల్గవ పట్టణ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
మహిళ ఆత్మహత్య
గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామానికి చెందిన మునగాల ప్రవల్లిక (27) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునగాల ఆదిశంకర్ భార్య మునగాల ప్రవల్లిక కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. గుత్తితో పాటు పలు ఆసుపత్రులతో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలను బయటకు పంపి తలుపులు మూసుకుని ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుంది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ప్రవల్లికను కిందకు దింపిన అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవల్లిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కటకటాల్లోకి గంజాయిబ్యాచ్
తాడిపత్రిటౌన్: తాడిపత్రి రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్న బ్యాచ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి పట్టణానికి చెందిన కరీమ్, ప్రకాష్‌నాయుడు, అస్రాబ్, మరో ఇద్దరు రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 5 మందిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు వెల్లడైంది. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి, నకిలీ నోట్ల పట్టివేత : ఇద్దరి అరెస్టు
గుత్తి: గంజాయితో పాటు నకిలీ నోట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్‌ఐ అమీర్ ఖాన్ తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామా నికి చెందిన సి.గోపాల్, దిమ్మగుడికి చెందిన బద్రి బైక్‌లో గంజాయి, నకిలీ నోట్లు తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలోనే గుత్తి అనంత పురం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన సీఐ రామారావు, ఎస్‌ఐ అమీర్ ఖాన్‌లు వారిని పట్టుకున్నారు. బైక్‌లో ఉన్న 20 గ్రాముల గంజాయి, 47 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుత్తికి చెందిన రమేష్‌కు గంజాయి, నకిలీ నోట్లు ఇచ్చి కేసులో ఇరికించాలని నిందితులు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వారిని జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు.


