ఉరవకొండ: మండల పరిధిలోని వెలిగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గేట్ పడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి చండ్రాయుడుకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు నాయకులు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలకు పాల్పడి పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బడులు ప్రారంభమైనా పిల్లలకు యూనిఫాం, నోటు పుస్తకాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్పకు నాయకులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సాకే పురుషోత్తం,ఏఐఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నందు, తరుణ్, భాస్కర్, నరసింహ, నాగరాజు, పవన్, దేవా, రవి, సుధాకర్ పాల్గొన్నారు.
జూదరుల అరెస్టు
పెద్దపప్పూరు: మండలంలోని తబ్జూలలో మంగళవారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. తబ్జూల, శింగనగుట్టపల్లి గ్రామాలకు చెందిన 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.52,650 నగదుతో పాటు ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
బరితెగించిన దొంగలు
● బళ్లారి బైపాస్‌లో పట్టపగలే చోరీ
అనంతపురం సెంట్రల్: నగరంలోని బళ్లారి బైపాస్‌లో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున బళ్లారి రోడ్డులోని ఎంజీ పెట్రోలియం బంకు పక్కన ఆర్‌వీ వైన్స్ దుకాణంలో విలువైన వైరింగ్ సామాన్లు, వంట సామగ్రిని ఎత్తుకెళ్లిన విషయం విదితమే. బాధితుడు అశోక్‌బాబు గమనించి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. దీంతో త్రీటౌన్ కానిస్టేబుళ్లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే మరోసారి అదే దుకాణంలో చొరబడ్డారు. అది కూడా మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో చొరబడి దొరికిన సామాన్లు తీసుకెళ్లిపోయారు. ఏకంగా ఆటో తీసుకొచ్చి అందులో వేసుకెళ్లడం గమనార్హం. స్థానికంగా ఉంటున్న కొంతమందే నేరాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.


