● సమస్యలపై 30న చలో విజయవాడ
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
అనంతపురం అర్బన్: ‘‘రెండేళ్ల చంద్రబాబు పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల ముందు రంగురంగుల హామీలు గుప్పించి గద్దెనెక్కిన తరువాత అటకెక్కించారు’’ అని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజమెత్తారు. రైతుల సమస్య పరిష్కారానికి ఈనెల 30న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల కాలంలో రైతుల కష్టాలను తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. సిండికేట్ మార్కెట్ మాయాజాలంలో రైతులు నష్టపోతున్నారని, చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రూ.2 లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేయాలన్నారు. స్వామినాథన్ సిఫారసు మేరకు సమగ్ర ఉత్పత్తి వ్యవసాయానికి 50 శాతం అదనంగా అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్నారు. పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు లింగమయ్య,రాజేష్‌గౌడ్,కుళ్లాయిస్వామి, కృష్ణుడు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
23 నుంచి ఉరవకొండలో శిక్షణా శిబిరాలు
ఉరవకొండ: స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ–సైద్ధాంతిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. మంగళవారం శిక్షణా శిబిరాల ఏర్పాట్లను జిల్లా కార్యదర్శితో పాటు సీపీఐ ముఖ్యనాయకులు పరిశీలించారు. 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, 23న శిక్షణా తరగతులకు పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాలుకా కార్యదర్శి చెన్నరాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, నాగేంద్ర, సుల్తాన్, మల్లేష్, బసరాజు తదితరులు పాల్గొన్నారు.


