అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలవ్వాలని డీఆర్‌ఓ ఎ.మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సమాచార హక్కు చట్టంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా కార్యాలయాల వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అపిలేటివ్, అసిస్టెంట్ అపిలేటివ్ అధికారులు సక్రమంగా ఇవ్వాలన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు రాయల కొండయ్య, లాల్యనాయక్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నగరాజునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు..
సమాచార హక్కు చట్టం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటైంది. జిల్లా సమన్వయ అధికారిగా కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా ఎస్పీ, నోడల్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి, సభ్యులుగా జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, డీఈఓ, సమాచార హక్కు చైతన్య వేదిక రాయలకొండయ్య, సమాచార హక్కు ఐక్యవేదిక అధ్యక్షుడు లాల్యనాయక్ వ్యవహరిస్తారు.


