గేటు పడి విద్యార్థికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

గేటు పడి విద్యార్థికి గాయాలు

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

ఉరవకొండ: పాఠశాల గేటుపడి విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వెలిగొండకు చెందిన చెన్నకేశువులు కుమారుడు చండ్రాయుడు స్థానిక ప్రభుత్వ పాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం విరామ సమయంలో చండ్రాయుడు పాఠశాల గేట్‌పై నిల్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గేట్‌ ఊడి చండ్రాయుడిపై పడింది. సమీపంలో చిల్లర కొట్టు యజమాని గమనించి ఉపాధ్యాయులకు సమాచారం చేరవేశాడు. ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థిని ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై దాడి

ఉరవకొండ: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై గ్రామస్తులు దాడి చేశారు. లత్తవరం తండాలో ఉపాధి హామీ పథకం కింద ఇటీవల రూ.5 లక్షల వ్యయంతో ఇంకుడు గుంతల పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో వెండర్‌తో కలిసి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలకు పాల్పడ్డాడని, కూలి సొమ్ములో తమకూ ఇంకా కొంత రావాల్సి ఉందని కూలీలు రోజూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం తండావాసులు నేరుగా ఉరవకొండలోని ఉపాధి హామీ ఏపీఓ కార్యాలయంలో ఉన్న రవినాయక్‌ను చితకబాదారు. కార్యాలయం బయటకు వచ్చాక మరోమారు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు దాడిచేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హతమారుస్తామంటూ బెదిరించారు : బీజేపీ నేత విష్ణు

అనంతపురం సిటీ: తనను హతమారుస్తామంటూ ఐదు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారని బీజేపీ నేత ఎస్‌.విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తనకు కాల్‌ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడారని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ వారు పట్టించుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.

ఆరోపణలు సరికాదు

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదని విష్ణు అన్నారు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉదిరిపికొండలో

కూడేరు సీఐకు ఓటు హక్కు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: విధులు ఒక చోట.. నివాసం మరొకచోట.. స్వస్థలం ఇంకో చోట.. ఇవన్నీ కాదని ఓ గ్రామంలో సీఐ ఓటు హక్కు కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. కూడేరు సీఐ రాజు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్సార్‌సీపీ వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన అనంతపురంలో నివాసముంటూ కూడేరులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయనకు ఓటు హక్కు కూడేరు మండలం ఉదిరిపికొండలోని 2–42 చిరునామా కింద ఓటరు ఐడీ (వైడబ్ల్యూబీ3309457)తో 1245 క్రమ సంఖ్యలో ఉంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎవ్వరూ పోటీలో లేకుండా చేయడంతో పాటు గ్రామంలో టీడీపీ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా చేర్చడంలో సీఐ కీలకంగా వ్యహరించబోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటు హక్కు విషయమై బీఎల్‌ఓ రమణను వివరణ కోరగా.. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే జరుగుతోందని, సీఐకు మరోచోట కూడా ఓటు ఉంటే ఎక్కడైనా ఒక చోట ఉంచి, మరొకటి తొలగిస్తామని చెప్పారు.

కరువుపై రేపు సదస్సు

అనంతపురం: కరువు, ఎడారీకరణ నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న నగరశివారు పంగల్‌ రోడ్డు వద్ద గల ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి తెలిపారు. ‘కరువు, వాతావరణ మార్పులు, ప్రకృతి వ్యవసాయం రైతుల అనుభవాలు’ అనే అంశంపై జరిగే సదస్సుకు కలెక్టర్‌ ఆనంద్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement