అనంతపురంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్లో సెమీ రెసిడెన్షియల్‌ విధానంలో ఒకటో తరగతి విద్యార్థికి మెస్‌ ఫీజు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట రూ.30 వేలుగా ఉన్న ఈ మొత్తం, గత ఏడాది రూ.35 వేలకు పెరిగి, ఇప్పుడు రూ.40 వేల మార్కును చేరుకుంది. విద | - | Sakshi
Sakshi News home page

అనంతపురంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్లో సెమీ రెసిడెన్షియల్‌ విధానంలో ఒకటో తరగతి విద్యార్థికి మెస్‌ ఫీజు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట రూ.30 వేలుగా ఉన్న ఈ మొత్తం, గత ఏడాది రూ.35 వేలకు పెరిగి, ఇప్పుడు రూ.40 వేల మార్కును చేరుకుంది. విద

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్య వ్యాపారమయంగా మారింది. ఎంత కష్టమైనా సరే పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాలనుకున్న తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఐదో తరగతి విద్యార్థికే రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు 460, కార్పొరేట్‌ విద్యాసంస్థలు 45 ఉన్నాయి. ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌, సీబీఎస్‌ఈ, టెక్నో, ఐకాన్‌, సీ–బ్యాచ్‌, ఐపీఎల్‌, ఎస్‌.బ్యాచ్‌, ఒలింపియాడ్‌, పీఓ, కోస్పార్క్‌, ఇస్రో, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ వంటి ఆకర్షణీయ పేర్లతో తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి. అయితే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అనుమతులు లేని కోర్సులు?

కొన్ని విద్యాసంస్థలు ఐసీఎస్‌ఈ, అంతర్జాతీయ సిలబస్‌, విదేశీ ప్రమాణాల విద్య అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఆసలు ఆయా కోర్సులకు సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లోని ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నారంటూ ప్రచారం చేస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నా, వాటిపై అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అప్పులపాలవుతున్న తల్లిదండ్రులు

కరువు పరిస్థితులతో సతమతమవుతున్న జిల్లాలో కూలి పనులు, వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే అధికం. అయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చాలామంది కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్న పరిస్థితి నెలకొంది. విద్య ఒక అవసరంగా ఉండాల్సిన సమయంలో, అది కుటుంబాలపై ఆర్థిక భారం అవుతోందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజుల నియంత్రణ ఎక్కడ?

ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ.. వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు ఫీజుల నిర్మాణం, అదనపు వసూళ్లు, మెస్‌ చార్జీలు, ప్రత్యేక కోర్సుల పేరుతో జరుగుతున్న దోపిడీపై సమగ్రంగా పరిశీలించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్య హక్కు అయినప్పుడు, అది కొందరి వ్యాపార సాధనంగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్‌ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించడం, మెస్‌ ఫీజులు, ఇతర అదనపు వసూళ్లపై పారదర్శకత తీసుకురావడం, అనుమతులు లేని కోర్సులపై చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుంది.

కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు ౖపైపెకి

పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం

ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement