కళ్యాణదుర్గం: పోలీసుల ఏకపక్ష తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు అక్రమ కేసుల బనాయింపునకు పూనుకున్నారు. పోలీసులు చూపుతున్న ‘పచ్చ’పాతంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచనకు గురిచేసిన తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో కళ్యాణదుర్గంలో ఈ నెల 12న నిరసన ర్యాలీ నిర్వహించారు. అనుమతి తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు అప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ అడ్డు తగిలారు. ఇదే క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగైనా వైఎస్సార్‌సీపీ ర్యాలీని భగ్నం చేయడానికి కుట్ర పన్నారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు బైకులపై శబ్దాలు చేస్తూ టీ సర్కిల్‌లో బాణసంచా పేల్చుతూ రెచ్చ గొట్టేలా ప్రవర్తించారు. ఇదంతా పోలీసులు చూస్తున్నా అడ్డుకోకపోగా.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అక్కడి నుంచి తరిమివేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు. నిరసన ర్యాలీలో అవతలి పార్టీ వారిని రెచ్చగొడుతున్నారని, ప్రజలకు, వాహనదారులకు ఆటంకం కలిగించారంటూ పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ కేఎస్ లింగరాజుతో ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, మున్సిపల్ కన్వీనర్ ఐ.సుధీర్, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ గోళ్ల సూరి, బ్రహ్మసముద్రం, కుందుర్పి, శెట్టూరు కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కురబ హనుమంత రాయుడు, ఎంఎస్ రాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు, కంబదూరు ఎంపీపీ తనయుడు భీమేష్, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులుతో పాటు మరికొంత మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఘర్షణ వాతావరణం నెలకొనేలా రెచ్చగొట్టిన టీడీపీ నాయకులపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనకాడుతున్నారు. గతంలో కూడా తిరుమల లడ్డూపై దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించినందుకు, ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరణ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విదితమే.
పథకం ప్రకారం రెచ్చగొట్టిన టీడీపీ నేతలు
ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు


