కరువు రైతు కన్నీటి వ్యథ | - | Sakshi
Sakshi News home page

కరువు రైతు కన్నీటి వ్యథ

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకుపోవడం కోసం హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు శాపంగా మారింది. సిమెంటుతో లైనింగ్‌ వేస్తే పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయని, బోర్లలో నీళ్లు తగ్గిపోతాయని ఆనాడే రైతులు భయాందోళన చెందారు. రైతులతో పాటు రైతుసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనబాట పట్టారు. అయినా ప్రభుత్వం మొండిగా సిమెంట్‌ లైనింగ్‌ చేపట్టింది. ఫలితంగా కాలువ పరిసర ప్రాంతాల వ్యవసాయ బోర్లలో నీరు తగ్గిపోయింది. నీరందక పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.

హంద్రీ–నీవా కాలువకు సిమెంట్‌ కాంక్రీట్‌తో లైనింగ్‌

అడుగంటిన భూగర్భజలాలు.. బోర్లల్లో తగ్గిన నీరు

నీరందక ఎండుముఖం పట్టిన ఉద్యాన పంటలు

కూడేరు: హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. కళ్లెదుటే నీరు పారుతున్నా బోర్లల్లో నీరు లేని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే కుప్పంకు కృష్ణాజలాలు తీసుకెళ్లింది. ఇందుకోసం జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా నీరు తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్‌ పనులు చేపట్టారు. హంద్రీనీవా 216వ కిలోమీటరు (జీడిపల్లి వద్ద) నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి సమీపంలోని పట్నం (400వ కి.మీ) వరకు లైనింగ్‌ పనులు చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీ –నీవా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే సిమెంట్‌ కాంక్రీట్‌తో లైనింగ్‌ చేయడం వల్ల కాలువలో నీరు వేగంగా ముందుకెళ్లిపోయింది. మట్టికాలువ అయితే నీరు సమీపంలోకి ఇంకి సహజసిద్ధంగా భూగర్భజలాలు పెరిగి బోర్లు రీచార్జ్‌ అయ్యేవి. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో బోర్లలో నీరు తగ్గిపోయి రైతుల కళ్లెదుటే చీనీ, దానిమ్మ, మామిడి, అరటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement