పామిడిలో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

పామిడిలో భారీ వర్షం

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఎల్‌–నినో ప్రభావం మొదలైనట్లు చెబుతున్నా నైరుతి రుతుపవనాల వల్ల జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 16.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పామిడిలో 84.6 మి.మీ భారీ వర్షం కురిసింది.

కొబ్బరిచెట్టుపై పడిన పిడుగు

ఆత్మకూరు: పి.యాలేరులో శుక్రవారం అర్ధరాత్రి వర్షం పడుతున్న వేళ గురుస్వామి అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు బయటకు రాగా.. కొబ్బరిచెట్టుపై మంటలు చెలరేగడం కనిపించింది.

1న రాష్ట్రపతి ముర్ము రాక

అనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై ఒకటో తేదీన బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద గల సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీని సందర్శించనున్నారు. విజిటర్‌ హోదాలో ‘జ్ఞాన సీమ’ ప్రాంగణంలో జరగనున్న సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ తొలి స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. 2020లో ఉత్తీర్ణులైన తొలి బ్యాచ్‌ నుంచి 2026 బ్యాచ్‌ వరకు మొత్తం 1,200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అలాగే 61 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులు హాజరు కానున్నారు. అభ్యర్థులు https:// cuap.ac.inలో వివరాలు తెలుసుకోవచ్చు.

నెలాఖరుకు ‘ఉపాధి’ సొమ్ము రికవరీ

అనంతపురం న్యూటౌన్‌: ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధులను బాధ్యుల నుంచి ఈ నెలాఖరులోగా రికవరీ చేస్తామని జిల్లా విజిలెన్స్‌ అధికారి (డీవీఓ) శ్రీనివాసులు వెల్లడించారు. ‘రూ.3.61 కోట్లు హాంఫట్‌ ’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని 31 మండలాల్లో ‘ఉపాధి’ అవకతవకలు, దానిపై వేసిన జరిమానా (ఫైన్‌) మొత్తం రూ.61,40,285 ఉందన్నారు. ఇందులో రికవరీ రూపంలో రూ.31,94,120 ఉండగా, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై రూ.29,46,165 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005 స్థానంలో ‘వికసిత్‌ భారత్‌–రోజ్‌గార్‌ అజీవికా మిషన్‌(గ్రామీణ) (వీబీ–జీ రామ్‌ జీ)–2025’ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుందన్నారు. ఆ లోపే ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన 1,233 మందిని వ్యక్తిగతంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న కళ్యాణదుర్గం, 18న తాడిపత్రి, 19, 23 తేదీల్లో రాయదుర్గం, 25న అనంతపురంలో గ్రామసభలు నిర్వహించి, నిధులను రాబడతామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement