‘తమ్ముళ్ల’ బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’ బరితెగింపు

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

చెరువు మట్టి యథేచ్ఛగా దోపిడీ

నెల రోజులుగా టిప్పర్లతో రవాణా

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరలేపారు. చెరువు మట్టిపై కన్నేసి తవ్వేస్తున్నారు. టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విడపనకల్లు మండలం డొనేకల్లు గ్రామంలోని చెరువులో సారవంతమైన మట్టి ఉంది. దీన్ని కొందరు టీడీపీ నాయకులు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టిప్పర్ల ద్వారా గడేకల్లు, ఎన్‌.తిమ్మాపురం, హంచనహాళ్‌, పొలికి గ్రామాలతో పాటు కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టి లోడులు వెళ్తున్నాయి. నెల రోజులుగా ఇలా చెరువు మట్టిని కొల్లగొడుతున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో అక్రమ తవ్వకాలు ఆపి.. చెరువును పరిరక్షించాలని ఈ నెల ఒకటో తేదీన గుంతకల్లు ఆర్డీఓకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది. ఆయన విచారణకు ఆదేశించారు. అయితే కిందిస్థాయి అధికారులు టీడీపీ నాయకులకు అనుకూలంగా ఒక తీర్మానం సృష్టించి, చెరువు మట్టి అక్రమంగా తవ్వడం లేదని నివేదికలో పొందుపరిచి విచారణను ‘మమ’ అనిపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి చెరువు మట్టి దందాకు చెక్‌పెట్టాలని డొకనేకల్లు గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement