గొడవ పడొద్దంటే కొట్టి చంపేశారు..! | - | Sakshi
Sakshi News home page

గొడవ పడొద్దంటే కొట్టి చంపేశారు..!

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

తాడిపత్రి యువకుడిపై పలువురి దాడి

ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే

ప్రాణాలు విడిచిన బాధితుడు

మైదుకూరు: హైవే రోడ్డు నిర్మాణంలో ఏర్పడే తుక్కు కొనుగోలు విషయంలో వ్యాపారుల మధ్య జరిగిన గొడవల్లో తాడిపత్రికి చెందిన ఇస్మాయిల్‌ వివేకా నంద (35) అనే యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఉలందకొండకు చెందిన రోషన్‌ తుల్లా అనే బిడ్డర్‌,కమిషన్‌ ఏజెంట్‌ బెంగళూరు–విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్‌ప్రెస్‌ హైవే నిర్మాణ కంపెనీ మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద ఉన్న తుక్కును కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్‌లో బిడ్‌ వేశాడు. దానికోసం 1. 50 కోట్లు డిపాజిట్‌ చెల్లించాడు. నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి సూచనతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూరిబాబు, పోతురాజు అనేవారికి తుక్కును అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. వారి వద్ద నుంచి రూ.1.10 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. అగ్రిమెంటు రాసుకునేందుకు రూ .10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. వారు ఆ మొత్తం ఇవ్వకుండా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని పిలిపించి తుక్కును అమ్మాలని చూశారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రోషన్‌ తుల్లా తోనే డీల్‌ చేసుకొని 21 టన్నుల తుక్కును రూ.6. 67 లక్షలకు కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. ఇంకా కొంత తుక్కు ఉందని దానిని అమ్మేందుకు తాడిపత్రి భగత్‌ సింగ్‌ కాలనీకి చెందిన వివేకానంద, హైదరాబాద్‌లోని మల్కాజ్‌ గిరిలో ఉంటున్న కమలాపురం నివాసి ఇల్లూరు సురేష్‌ బాబు అనే వారిని పిలిపించాడు. ఇదిలావుండగా తామిచ్చిన రూ 1. 10 లక్షలు అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని సూరిబాబు, పోతురాజు రోషన్‌ తుల్లాను అడిగారు. అతను వాయిదాలు వేస్తుండడంతో తమకు తెలిసిన బ్రహ్మంగారిమఠం మండలం టి. రామాపురం గ్రామానికి చెందిన బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని పిలిపించారు. బ్రహ్మనాయుడు అడ్వాన్స్‌ డబ్బు కోసం రోషన్‌ తుల్లాను నిలదీయగా రూ. 40 వేలు ఫోన్‌ పే చేశాడు. మిగిలిన రూ.70 వేలు శుక్రవారం రాత్రి ఇస్తానని చెప్పాడు. వీరంతా శుక్రవారం రాత్రి మైదుకూరులోని ఓ లాడ్జీలో కలిశారు. రూ .70 వేలు ఇవ్వాలని బ్రహ్మనాయుడు, సూరిబాబు, పోతురాజు రోషన్‌ తుల్లాను బెదిరిస్తూ దాడికి దిగారు. అక్కడే ఉన్న సురేష్‌ బాబు, ఇస్మాయిల్‌ వివేకానంద కలగజేసుకోవడంతో వారు వివేకానందను తీవ్రంగా కొట్టారు. అతన్ని సురేష్‌ బాబు లాడ్జీ నుంచి కారులో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. వివేకానంద సోదరుడు రవి ప్రతాప్‌ మైదుకూరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement