ప్రాణం తీసిన మద్యం భూతం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మద్యం భూతం

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

యాడికి: మద్యం భూతం ఓ ప్రాణం తీసింది. మండల కేంద్రంలోని పెద్దపేటలో శుక్రవారం రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త మృతి చెందాడు.సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. పెద్దపేటకు చెందిన నేత కార్మికుడు ప్రసాద్‌, హైమావతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల ప్రసాద్‌ మద్యానికి బానిసయ్యాడు. మగ్గం పనులు చేయకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో హైమావతి తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. మద్యం తాగేందుకు తెలిసిన వారి వద్ద అప్పులు చేయటమే కాకుండా ద్విచక్ర వాహనాన్ని సైతం ప్రసాద్‌ తాకట్టు పెట్టడంతో వారం క్రితం హైమావతి తన పుట్టింట్లో డబ్బు తీసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని విడిపించి ఇచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన ప్రసాద్‌ ఇంకా మద్యం తాగేందుకు ఇంట్లోని సిలిండర్‌ను వేరే వారికి విక్రయించేందుకు పూనుకున్నాడు. దీంతో హైమావతి అతనితో గొడవకు దిగింది. ‘పిల్లల పాఠశాలలు తెరుస్తారు.. వాళ్లకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి. మద్యం కోసం ఇలా ఇంట్లో వస్తువులు అమ్ముకుంటే ఎలా బతకాలి’ అంటూ వాపోయింది. అయినా, ప్రసాద్‌ వినకపోవడంతో ఆగ్రహానికి గురై భర్తను తోసేసింది. అనంతరం బాధతో ముగ్గురు కుమార్తెలు, కుమారుడిని వెంట బెట్టుకొని తన పుట్టింటికి వెళ్లి పోయినది. శనివారం ఉదయం ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న ప్రసాద్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైమావతి తోయడంతోనే గాయాలై ప్రసాద్‌ మృతి చెందాడని అతని బంధువు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హైమావతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, తండ్రి మృతి చెందటం, తల్లిని పోలీసులు అరెస్టు చేయటంతో వారి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అనాథలుగా మారారు. ఇక తమకు దిక్కెవరంటూ విలపిస్తున్న వారిని చూసి గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు.

నిత్యం తాగొస్తున్నాడని

భర్తతో భార్య గొడవ

ఆవేశంలో భార్య తోయడంతో కిందపడి భర్త మృతి

తండ్రి మృతి, తల్లి జైలు పాలవడంతో అనాథలైన ముగ్గురు పిల్లలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement