అనంతపురం ఎడ్యుకేషన్: 2010కు ముందు చట్టబద్ధంగా నియమితులైన ఉపాధ్యాయుల సేవా హక్కులు, సీనియారిటీ, పదోన్నతులు, ఇతర చట్టబద్ధ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇటీవల వైఎస్సార్‌టీఏలో చేరిన ఏపీటీఎఫ్–1938 నాయకులు విశ్వనాథరెడ్డి, మునిరెడ్డి, రమణారెడ్డి, రమేష్, రామసుబ్బారెడ్డి, చింతలరెడ్డి, నరేంద్రారెడ్డి, ఓబుళప్ప, ఓబిలేసు, బాలనాయక్, అంజనరెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితరులకు శనివారం సభ్యత్వాలను అందజేశారు. స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2010 ఆగస్టు 23న జారీ చేసిన టెట్ నోటిఫికేషన్, 2026 మే 29న గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు. 2010కు ముందు అప్పటి నిబంధనలు, అర్హతలు, ఎంపిక విధానాల ప్రకారం నియమితులైన ఉపాధ్యాయులకు తర్వాత అమల్లోకి వచ్చిన టెట్ అర్హతను వర్తింపజేయడం సహజ న్యాయం, సమానత్వం, న్యాయనిశ్చితి సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. గోవిందరెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు గోపాల్, సిద్ధ ప్రసాద్, రామకృష్ణ, కృష్ణానాయక్, కృష్ణ, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.


