అనంతపురం ఎడ్యుకేషన్/ రాయదుర్గం టౌన్/ కూడేరు: వేసవి సెలవులు ముగిశాయి. రెండు నెలలుగా ఆటపాటలతో గడిపిన విద్యార్థులు శుక్రవారం నుంచి మళ్లీ బడిబాట పట్టనున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలు, అసంపూర్తి కిట్లు, తాగునీటి ఇబ్బందులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 1,95,223 మంది విద్యార్థులకు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నప్పటికీ, పలు సమస్యలు వారికి స్వాగతం పలకనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు ఈసారి తొలి రోజున విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. కిట్లలో ఉండే తొమ్మిది రకాల వస్తువుల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. మూడు జతల యూనిఫాం, బెల్టులు, బ్యాగులు, షూ–సాక్సులు, డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ తదితర సామగ్రి సరఫరా ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అధికారుల సమాచారం ప్రకారం కొన్ని మండలాలకు మాత్రమే బెల్టులు, షూ–సాక్సులు, వర్క్‌బుక్స్ చేరాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా పూర్తికాలేదు. మిగిలిన సామగ్రి మరో పది రోజుల వ్యవధిలో విద్యార్థులకు అందే అవకాశం ఉందని చెబుతున్నారు.
పాఠశాలల్లో తాగునీటి సమస్య
ఆర్‌ఓ ప్లాంట్లు నిర్వహణ లోపాలతో పని చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు రెండో దశ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో అనేక పాఠశాలల్లో తరగతి గదుల కొరత కొనసాగుతోంది. కొన్ని చోట్ల 90 శాతం నిర్మాణ పనులు పూర్తయినా మిగిలిన చిన్నపాటి పనులు పూర్తి కాకపోవడంతో భవనాలు వినియోగంలోకి రావడం లేదు. వేసవి సెలవుల సమయంలోనే ఈ పనులు పూర్తి చేసి ఉంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
రాయదుర్గంలోని పాఠశాలలో ఆగిన అభివృద్ధి పనులు
కూడేరు హైస్కూల్లో బాలికల టాయిలెట్ల తలుపుల దుస్థితి
మౌలిక వసతులు కల్పించాలి
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, విద్యా బోధన ఉందని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో బడులను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. సమస్యలతో పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి పాఠశాలల్లో అత్యవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు వంటి మౌలిక వసతులను కల్పించాలి.
– మంజునాథ్‌రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు
సమస్యల మధ్యే విద్యార్థులకు స్వాగతం
పూర్తిస్థాయిలో అందని విద్యార్థి మిత్ర కిట్లు
చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్‌ఓ ప్లాంట్లు
అసంపూర్తిగా నిలిచిన ‘నాడు–నేడు’ భవనాలు


