గుంతకల్లు రూరల్: సరదాగా తెప్ప ఎక్కి.. ప్రమాదవశాత్తూ చెరువులోకి పడిపోయిన బాలుడు నీటమునిగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వై.టి.చెరువు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం గ్రామంలోని చెరువులో చేపలు పడుతుండటంతో లక్ష్మీనారాయణ తన కొడుకు పవన్(9)తో కలిసి చేపలు కొనేందుకు వెళ్లాడు. చేపలు ఇంకా పడుతుండటంతో ఆలస్యం అవుతుందని లక్ష్మీనారాయణ ఓ చెట్టుకింద కూర్చున్నాడు. కుమారుడు పవన్ ఇతర పిల్లలతో కలిసి చెరువు మేరలో నీటిపై నిలిపి ఉంచిన తెప్పలో దిగి అడుకుంటున్నాడు. పట్టుతప్పిన పవన్ తెప్పలోనుంచి నీటిలో పడి మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రి తెప్ప దగ్గరకు వెళ్లి పిల్లలను అడిగాడు. వాళ్లు తమకు తెలియదు అని చెప్పడంతో చెరువు బయట, చుట్టుపక్కల గాలించాడు. అయినప్పటికీ ఆచూకీ కనిపించకపోవడంతో నీటిలో పడిపోయాడేమో అన్న అనుమానంతో స్థానికులు తెప్ప పక్కనే ఉన్న గుంతలో గాలించి పవన్‌ను బయటకు తీశాడు. అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


