● బోగస్, తప్పుడు ఓట్లపై నిఘా పెట్టండి
● ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తత అనివార్యం
● బీఎల్‌ఏలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత దిశానిర్దేశం
అనంతపురం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్త వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ)కు, వైఎస్సార్‌సీపీ నేతలకు ‘ఎస్‌ఐఆర్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత వెంకటరామిరెడ్డి వారికి దిశానిర్ధేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు జరుగుతున్న కుట్రను తిప్పికొట్టాలన్నారు. అధికార పార్టీలు బోగస్, తప్పుడు ఓట్లను జాబితాలో ఎక్కించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దోహదపడే వివిధ రకాల దరఖాస్తులపై బీఎల్‌ఏలకు పూర్తి పట్టు ఉండాలని సూచించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపు వివాదాస్పదమైందన్నారు. అక్కడ అభ్యర్థులు గెలుపొందిన స్థానాలను పరిశీలిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కన్నా.. మెజార్టీ తక్కువ ఓట్లు రావడమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకులు తిప్పేస్వామి మాట్లాడుతూ పార్టీ ఐడీ కార్డుల పరిశీలన ప్రక్రియ 100 శాతం పూర్తయిందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా వ్యవహరించాలని కోరారు. ఎస్‌ఐఆర్ కో ఆర్డినేటర్ గోపీనాథ్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐఆర్ కమిటీ సభ్యుడు వెన్నం శివారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఎద్దుల అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్ గౌడ్, గోగుల రాధాకృష్ణ, మాజీ మేయర్ వసీం తదితరులు పాల్గొన్నారు.


