అనంతపురం టౌన్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో 7.23ఎకరాలు, కళ్యాణదుర్గం నియోజకవర్గం తిమ్మసముద్రంంలో 13.40 ఎకరాలు, తాడిపత్రి నియోజకవర్గం ఊరుచింతలలో 10.86ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో దాదాపు 293 ప్లాట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు 75 శాతం మేర రాయితీలను అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 96663 30666 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా శివప్రసాద్
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జె. శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ అకేపాటి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
బెల్టుషాపుల
నిర్వాహకులపై కేసులు
బెళుగుప్ప: మండల పరిధిలోని శ్రీరంగాపురంలో బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ పేర్కొన్నారు. శ్రీరంగాపురంలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నాంటూ మహిళలు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గ్రామానికి వెళ్లి బెల్టుషాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఏఐ సాయంతో పిల్లల సంరక్షణ
అనంతపురం సెంట్రల్: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరేళ్లలోపు చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నట్లు మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) శశికళ తెలిపారు. మంగళవారం నగరంలోని పాతూరులో కస్తూరిబాయి పాఠశాలలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, మాస్టర్ ట్రైనర్స్, అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ నిర్వహించారు. ఆరేళ్లలోపు పిల్లల సమగ్రాభివృద్ధి, ఎదుగుదలను ట్రాక్ చేయడంపై అవగాహన కల్పించారు. పోషణ్ ట్రాకర్ సాయంతో ఏఐ ఆధారిత సిస్టం ద్వారా మరింత స్పష్టమైన స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. పిల్లల కదలికలు, ప్రవర్తన, ఆటల వీడియోలను ఏఐ విశ్లేషించి, వారి వయస్సుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉందో లేదో ఏఐ చెబుతుందన్నారు.


