న్యూస్‌రీల్
గుత్తి రూరల్: జక్కలచెరువు ఆర్‌ఎస్ గ్రామంలో టెంకాయ చెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అంగడి రాజన్న ఇంటి ఆవరణలో ఉన్న టెంకాయ చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో చెట్టుకింద ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు శబ్దానికి సమీపంలోని నివాస గృహాలు కంపించాయి. భూకంపమేమోనని భావించి పలువురు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకుని చెట్టుపై మంటలను ఆర్పివేశారు.
ప్రయాణిస్తుండగా విడిపోయిన రైలు బోగీలు
● లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
గుత్తి: గుత్తి రైల్వేస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (06571) బోగీలు విడిపోయాయి. ప్లాట్‌ఫారం–1పై వెళుతున్న సమయంలో ఎస్–6, ఎస్–7 మధ్య జాయింట్ కప్లింగ్ ఊడిపోవడంతో బోగీలు వేరయ్యాయి. లోకో పైలట్ గమనించి వెంటనే రైలును నిలిపివేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే టెక్నీషియన్స్ ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. అనంతరం రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. బోగీలు విడిపోయిన కారణంగా రైలు గంట ఆలస్యంగా నడిచింది.


